హైదరాబాద్ ఫిబ్రవరి 10
ఆయుధాలతో అక్రమ దందాకు పాల్పడుతున్న ఘటనలో సస్పెండ్‌కు గురైన రిజర్వ్ ఇన్స్పెక్టర్ అల్లం కిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలోని స్థలాల వ్యవహారంలో నిందితుడు తలదూర్చినట్లు పోలీసులు తెలపారు. స్థల వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి కరీంనగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అబ్బాస్ వద్ద 39 లక్షలను నిందితుడు తీసుకొని మోసం చేశాడు. అయితే డబ్బులను తిరిగి ఇవ్వకుండ బాధితులను కిషన్ రావు బెదిరించాడు. కిషన్ ఎయిర్ గన్స్‌తో బెదిరింపులకు పాల్పడుతున్నాడని అబ్బాస్ రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టి కేసు నమోదు చేసిన పోలీసులు యూసుఫ్‌గూడా పోలీస్ బెటాలియన్‌లో నివసిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న నాలుగు ఎయిర్ గన్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిగరెట్ లైటర్‌ను వెలిగించే డమ్మీ గన్‌ను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. లక్ష్మన్ అనే మరో వ్యక్తి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా నిందితుడిపై పలు కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు.