కర్నూలు, ఫిబ్రవరి 12,
ప్రత్యేక ఆదోని జిల్లా కోసం డిమాండ్ ఉంది. తాజా జిల్లాల పునర్విభజన ఆ డిమాండ్‌కు భిన్నంగా ఉండటంతో స్థానికులకు రుచించలేదు. టోన్ పెంచేశారు. ఆ ప్రాంతానికి చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నోరెత్తడం లేదట. దీంతో వారికేమైంది అని ఒక్కటే ప్రశ్నలుకర్నూలు జిల్లాలో కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ.. ఇదే జిల్లాలో ప్రత్యేక ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. అది నెరవేరకపోవడంతో రోడ్డెక్కారు ఇక్కడి జనం. ప్రజలు గొంతెత్తున్నా ఆ ప్రాంతానికి చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు కిమ్మనకపోవడం ప్రస్తుతం చర్చగా మారింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలు కర్నాటక సరిహద్దుకు దగ్గరగా.. ఒక మూలకు విసిరేసినట్టుగా ఉంటాయి. పూర్తిగా వెనకబడిన ప్రాంతాలు. జిల్లా కేంద్రానికి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో జిల్లాస్థాయి అధికారుల రాకపోకలు అంతంత మాత్రమే. ఈ కారణంగానే ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లుగా కోరుతున్నారు స్థానికులు. ఇప్పుడు ప్రజాసంఘాలు.. రాజకీయపార్టీలు జనం గొంతుతో గొంతు కలుపుతున్నాయిరాష్ట్రంలో కొత్త జిల్లాలపై కొన్నిచోట్ల తమ ప్రాంతాలకు అన్యాయం జరిగిందని అధికార, ప్రతిపక్షాలు రోడ్డెక్కుతుంటే ఆదోని జిల్లాకోసం స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడంతో చర్చ జరుగుతోందట. ఆదోని, సమీప నియోజకవర్గాల్లో అధికారపార్టీ కేడర్ కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనే అభిప్రాయంతో ఉన్నారట. ప్రభుత్వ నిర్ణయం ప్రతిపాదనల దశలో ఉండటంతో నేతలు ఒత్తిడి చేస్తే ఆదోని జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉంటుందనేది స్థానికంగా వినిపించే మాట. పక్కనే ఉన్న తెలంగాణలో జోగులాంబ గద్వాల్ జిల్లా కూడా మొదట ఏర్పాటు కాలేదని.. డీకే అరుణతోపాటు టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాక వాళ్ల డిమాండ్ నెరవేరిందని గుర్తు చేస్తున్నారట.152 ఏళ్ల క్రితమే మున్సిపాలిటీగా ఏర్పాటై.. ఆదోని వ్యాపారపరంగా రెండో ముంబైగా పేరు తెచ్చుకుంది. వందల సంఖ్యలో ఆయిల్, పత్తి మిల్లులు ఏర్పాటు చేసి అప్పట్లోనే వేల మందికి రెండు చేతులా పని కల్పించిన ప్రాంతం. ప్రస్తుతం మిల్లులు మూతపడి.. కరువుతో అల్లాడుతూ పూర్తిగా వెనుకబడిపోయిన ప్రాంతం ఆదోని. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారట. ఆదోనితోపాటు సమీప నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే చర్చ మొదలైంది.ఆదోనిని జిల్లా కేంద్రంగా చేయాల్సిన అవసరాన్ని కనీసం అధిష్ఠానం దృష్టికి తీసుకొని పోవడానికి కూడా సాహసం చేయడం లేదు లోకల్ ఎమ్మెల్యేలు.. అధికారపార్టీ నేతలు. అధిష్ఠానానికి చెప్పి ఒప్పిస్తే.. ప్రజల ఆదరణ దొరికే అవకాశం ఉన్నా హైకమాండ్ ఏం అంటుందో అన్న భయం నేతల్లో ఉందట. అందుకే జిల్లాలు ప్రకటించినప్పటి నుంచి ఆదోనిలో ఆందోళనలు జరుగుతున్నా అధికాపార్టీ పెద్దలు నోరు మెదపడం లేదు. పైగా ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఉంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు. అందులో ఒకరు మంత్రి.ఆదోని జిల్లా కోరడం ప్రభుత్వాన్ని, పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించినట్టు కాదని.. తమ ప్రాంత ప్రయోజనాల కోసం ఒత్తిడి చేయడమేనని వైసీపీ వర్గాలూ వివరిస్తున్నాయట. 17వేల 658 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 45 లక్షల జనాభా ఉన్న కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడం సమంజసమన్నది వారి వాదన. ఈ విషయాలు తెలిసినా అధికారపార్టీ ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటమే పార్టీ వర్గాలను, ప్రజలను ఆశ్చర్య పరుస్తున్నారు