హైదరాబాద్, ఫిబ్రవరి 12,
తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు. సుమారు పుష్కర కాలం పైగా, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన, నాయకుడు. అలాంటి నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జనంలోకి రావడానికి భయ పడుతున్నారా? అంటే అవుననే సమధానమే వస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపు ఇస్తే చాలు, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలను రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం లేదా గృహ నిర్బంధం విధించి, ఇంట్లో నుంచి కాలు బయట పెట్ట కుండా చేయడం. అలాగే, ముఖ్యమత్రి ప్రగతి భవన్ లేదా ఫార్మ్ హౌస్ నుంచి కాలు బయట పెట్టాలన్నా అంతే,ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల అరెస్ట్లు . గృహ నిర్బంధాలు అనివార్య మవుతున్నాయి.గతంలో పీసీసీ రేవత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఫ్రం హౌస్ ( వరి పంట) బండారం బయట పెట్టేందుకు,ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వద్ద ఆందోళన కర్యక్రమం ప్రకటిస్తే, రాత్రికి రాత్రే కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇలా ఒక సారని కాదు, ఒక సందర్భం అని కాదు, పోలీసులు అర్థ రాత్రి కోదండరామ్ ఇంటి తలుపులు పగల కొట్టిన దగ్గరి నుంచి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ ఎంపీ కార్యాలయం గేట్లు గ్యాస్ కట్టర్లతో పోలీసులు కట్ చేసి జరిపిన దాడి వరకు అనేక సందర్భాలలో ప్రతిపక్షాల ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కలరస్తోందనే ఆరోపణలు వినవస్తూన ఉన్నాయి. చివరకు ప్రగతి భవన్ వద్ద కూడా, గతంలో ఎప్పుడు లేని విధంగా రక్షణ పెంచుకుంటూ పోతున్నారని, ఇది ముఖ్యమంత్రి భయాని సంకేతమని మాజీ ఎంపీ, కొండావిశ్వేశ్వర రెడ్డి వంటి అనేక మంది ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం పర్యటన సందర్భంగా బీజేపీ ప్రజాప్రతినిధులు హౌజ్ అరెస్టు చేయడంతోపాటు నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి నిర్బంధించారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌజ్ బయటకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీల నాయకులను హౌజ్ అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. గత రెండ్రోజులుగా జనగాం జిల్లా కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి నానా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.గతంలో ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తున్నారంటే… జనం సంతోషంగా ఉండేవాళ్లు. సమస్యలు పరిష్కారమవుతాయనే భావన ఉండేది. జనం వినతి పత్రాలతో సీఎంను కలిసేందుకు సిద్ధంగా ఉండేవాళ్లు. కానీ సీఎం కేసీఆర్ వస్తుంటే జనం భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. పోలీసుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నరు. ప్రతిపక్షాల ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట చేస్తున్నరు. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నరు. సామాన్య ప్రజలను కట్టడి చేస్తూ నిర్బంధిస్తున్నారు. ఇంతటి దుర్మార్గమైన పాలన దేశంలో మరెక్కడా చూడలేదు, అని బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే, ఉద్యమ నాయకుడు ... కేసీఆర్’లో ఈ మార్పుకు కారణం ఏమిటి? ఎందుకు... ఈ నిర్భందాలు.. అంటే ముఖ్యంత్రే సమాధానం చెప్పాలని అంటున్నారు .. విశ్లేషకులు.