YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తుమ్మల, జలగం కలిసిపోతారా

తుమ్మల, జలగం కలిసిపోతారా

ఖమ్మం, ఫిబ్రవరి 12,
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. అక్కడి పరిణామాలు అనూహ్యంగా చర్చల్లోకి వస్తాయి. అలా అందరి నోళ్లల్లో నానుతుందే కొత్తగూడెం నియోజకవర్గం. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ ఎపిసోడ్‌ రాజకీయాల్లో ఒక్కసారిగా అటెన్షన్ తీసుకొచ్చింది. వనమా తర్వాత కొత్తగూడెంలో టీఆర్ఎస్‌ను నడిపించేది ఎవరు అనే చర్చ కూడా జరిగింది. ఇలాంటి సమయంలో కూడా మౌనంగా ఉంటే బాగోదనుకున్నారో ఏమో మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్‌ నేత జలగం వెంకట్రావు జన మధ్య తళుక్కుమంటున్నారు. నేను టీఆర్ఎస్‌లోనే ఉన్నాను.. ఎక్కడికి వెళ్లలేదు అని చెప్పుకొంటున్నారట. దీంతో జలగం ఏంటి.. ఆ గళం ఎందుకు ఎత్తుకున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ గెలుచుకున్న ఏకైక అసెంబ్లీ సీటు కొత్తగూడెం. ఆ ఎన్నికల్లో గెలిచింది జలగం వెంకట్రావే. జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే కావడంతో మంత్రిని చేస్తారని జలగం వెంకట్రావు ఆశించినా కేబినెట్‌లో బెర్త్‌ దక్కలేదు. 2018లో టీఆర్ఎస్‌ మరోసారి టికెట్‌ ఇచ్చినా.. కాంగ్రెస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు జలగం. ఆ తర్వాత వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వనమా చేరిక రుచించలేదో ఏమో జలగం అలిగారు అనే ప్రచారం బయటకొచ్చింది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించినా వెళ్లలేదు. పల్లా రాజేశ్వరర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఎన్నికల సన్నాహక కమిటీ రమ్మని పిలిచినా స్పందన లేదు.ఇప్పుడు కొత్తగూడెం రాజకీయాల్లో వచ్చిన మార్పులతో గేర్‌ మార్చేశారు జలగం వెంకట్రావు. మరోసారి క్రియాశీలకంగా వ్యవహరించాలని చూస్తున్నారట. టీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడైన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కొత్తగూడెంలో అభినందన సభ జరిగినా రాని ఆయన.. తాజాగా తాను టీఆర్ఎస్‌లోనే ఉన్నానని ప్రకటనలు ఇస్తున్నారు. టీఆర్ఎస్‌లోనే ఉంటానని.. టీఆర్‌ఎస్‌ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారట. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ టికెట్‌ ఇవ్వకపోతే అప్పుడు చూద్దాం.. తాను మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్సే కదా సన్నిహితుల దగ్గర కామెంట్స్‌ చేస్తున్నారట. గతంలో తనను అనుసరించి.. ఎన్నికల్లో ఓడిన తర్వాత దూరమైన అనుచరులను, పార్టీ కేడర్‌ను దగ్గరకు తీసుకుంటున్నట్టు సమాచారం.
కొత్తగూడెంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా కన్నేయడంతో.. ఆయన్ని ఎలాగైన అడ్డుకోవాలని జలగం వర్గం చూస్తోందట. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలను ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు. నిన్న మొన్నటి వరకు ఎడముఖం పెడముఖంగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావులు ఆ మధ్య ఓ విహహానికి వచ్చారు. అక్కడ మాటలు కలిసిన వేళా విశేషమో ఏమో ఇద్దరూ మళ్లీ దోస్తులయ్యారని టాక్‌. దాదాపు గంటసేపు రాజకీయాలపై చర్చించుకున్నారట. అక్కడ నుంచి ఇద్దరూ ఒకే కారులో వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. దాంతో ఇద్దరి టార్గెట్‌ మాజీ ఎంపీ పొంగులేటే కావచ్చొనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి గులాబీ వర్గాలు. కొత్తగూడెంలో ప్రతికూలతలు.. ప్రత్యర్థులు లేకుండా జలగం వెంకట్రావు వేస్తున్న ఈ ఎత్తుగడలు ఏ మేరకు వర్కవుట్‌ అవుతాయో చూడాలి.

Related Posts