న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 12
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను తొలిగించేందుకు త్రిసభ్య కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితోపాటు ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 17 న కమిటీ తొలి సమావేశం జరగనున్నది.త్రి సభ్య కమిటీ ఏర్పాటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ గతంలో ప్రకటన చేసిన కేంద్రం.. ప్రస్తుతం హోంశాఖ ఎజెండాలో ప్రత్యేక హోదా విషయాన్ని చేర్చినట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించేందుకే త్రి సభ్య కమిటీ అంటూ పేర్కొన్న హోంశాఖ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా.. కేంద్రం చెవికి ఎక్కడం లేదు.ఈ కమిటీ సమావేశంలో ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చతోపాటు ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యలు, పన్నుల వ్యవహారం, వనరు వ్యత్యాసాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌పై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు కేంద్రం దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సమస్యలపై ఎజెండాలో మచ్చుకైనా కనిపించకపోవడాన్ని బట్టి చూస్తే తెలంగాణపై మరోసారి తమ అక్కసు వెళ్లగక్కేందుకు కేంద్రం కుట్రపన్నుతున్నట్లుగా అర్ధమవుతున్నది. ఈ నెల 17 నాటి తొలి సమావేశంలో చర్చించే అంశాల ఆధారంగా తర్వాతి డెవలప్‌మెంట్స్ ఎలా ఉంటాయనేది తేలుతుంది.