హైదరాబాద్ ఫిబ్రవరి 12
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదని చెప్పారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంపై మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఎన్నారై లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. తెలంగాణ ఏర్పాటుపై అనేక అనుమానాలు వ్యక్తంచేసిన పరిస్థితి నుంచి దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా రూపాంతరం చెందామన్నారు. భారీ ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యవసాయం, సంక్షేమం వంటి రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు.ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యం వంటి రంగాల్లోనూ విప్లవాత్మకమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని, ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకొని మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీల వరకు నూతనంగా వందలాది విద్యాసంస్థలను ఏర్పాటు చేశామని, లక్షలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామని చెప్పారు.రాష్ట్రంలోని సర్కారును బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం చేపట్టిందని వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.7289 కోట్లతో సుమారు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి చెందిన తెలంగాణ బిడ్డల భాగస్వామ్యాన్ని కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములవాలని ఎన్నారైలను కోరారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు త్వరలోనే సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ దేశాలలో స్థిరపడిన ఎన్నారైలు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారైల తోపాటు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల, అనిల్ కూర్మాచలం, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.