YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రోడ్లు వేస్తున్నారు... అయినా ఎక్కడ పడితే పాట్ హోల్స్

రోడ్లు వేస్తున్నారు...  అయినా ఎక్కడ పడితే పాట్ హోల్స్

హైదరాబాద్ నగరంలో రోడ్లకు ఎక్కడ చూసినా తూట్లే దర్శనమిస్తున్నాయి. ఇక చిన్నపాటి వర్షం కురిసిందంటే చాలు ముందుకు ప్రయాణించాలంటే ప్రత్యక్ష నరకమే. ఏటా కోట్ల రూపాయలు కేటాయించి రీ కార్పొరేటింగ్, మరమ్మతులు చేస్తున్నా,  జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, పనుల్లో శాస్ర్తియంగా లేకపోవటంతో రోడ్ల మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటగానే తయారైంది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో రోడ్లపై వచ్చిన ఫిర్యాదులకు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు సీరియస్‌గా స్పందించి కనీసం రానున్న ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లను బాగు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సుమారు రూ. 1120 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను అధికారులు ముమ్మరం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త రోడ్ల నిర్మాణం, మరికొన్నింటికి మరమ్మతుల పనులు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులన్నీ వచ్చే నెల మొదటి వారంకల్లా పూర్తి చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు టార్గెట్ విధించారు. గడువులోపు పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లను గుర్తించి, బ్లాక్ లిస్టులో పెట్టాలని కూడా జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. అన్ని రంగాల్లో ఇపుడిపుడే అభివృద్ది చెందుతున్న నగరం ఇటీవలే ఉత్తమ నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందటం, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ క్యాంపులు, కార్యాలయాలు నిర్మించుకునేందుకు హైదరాబాద్‌లో నిర్మాణాలు చేపట్టాయని, పెరుగుతున్న పట్టణీకరణ, జనాభాకు అనుకూలంగా వౌలిక, రవాణా వసతులను మెరుగుపరిచేందుకు ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి రోడ్డు పనులను చేపడుతున్న అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోడ్లకు వెచ్చిస్తున్న మొత్తంలో జీహెచ్‌ఎంసీకి ద్వారా రూ. 720 కోట్లు, హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ. 400 కోట్లను వెచ్చించి, అన్ని మార్గాలు కవరయ్యేలా పనులు చేపడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా ఇంజనీర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఈ రోడ్ల నిర్మాణ పురోగతిపై జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మేయర్, అధికారులు ఎప్పటికపుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Related Posts