మేడ్చల్
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. అధికార పార్టీ అనే ధీమాతో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంతో బల్దియా అధికారులు కొరఢా ఝులిపించారు. ఎమ్మెల్యేకు ఏకంగా లక్ష రూపాయల ఫైన్ విధించారు. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ తన నియోజకవర్గ పరిధిలోని హబ్సీగూడ నుంచి ఉప్పల్ వరకు భారీగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపుల కటౌట్లు ఏర్పాటు చేయడంతో రోడ్డు ఇరుకుగా మారింది. మరోవైపు స్కై వే నిర్మాణంతో ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలకు రూ.5 వేలు మొదలుకుని రూ.15 వేల వరకు జరిమానా విధించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి రూ. లక్ష ఫైన్ విధించినట్లు అధికారులు తెలిపారు. అయితే గురువారం రాత్రి అధికారులు ఫైన్ విధించినా.. శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించకపోవడం గమనార్హం. ఇతర పార్టీల కటౌట్లు మాత్రం వెంటనే తొలిగించే అధికారులు అధికార పార్టీ నాయకుల కటౌట్లను మాత్రం అలాగే వదిలేయడం పట్ల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.