గుంటూరు, ఫిబ్రవరి 14,
తెలుగు సినీ పరిశ్రమను సీఎం జగన్ విశాఖకు ఆహ్వానించినప్పుడు అమరావతి గుర్తుకు రాలేదా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ల కోసం సమయం కేటాయించిన సీఎం జగన్ రెడ్డి అమరావతి రైతుల కోసం ఎందుకు కేటాయించరంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సర్వ నాశానం అయిపోయిన రోడ్ల గురించి, యూరియా అందుబాటులో లేక రోడ్డెక్కిన అన్నదాతల కోసం ఎందుకు సమయం కేటాయించరని నిలదీస్తున్నారు. సమస్యలను సృష్టించడమే కాకుండా వాటిని మరింతగా జఠిలం చేసి, చివరికి బాధిత వర్గాలు తనను బతిమాలుకునేలా చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమ పెద్దల చేత కూడా బతిమాలించుకుని, చేయెత్తి దండం పెట్టించుకుని మరీ తన ఈగోను సంతృప్తి పరుచుకునే జగన్ ధోరణిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా పెద్దల పరిస్థితే ఇలా ఉంటే ఇక ఏపీలో సామాన్యుడికి దిక్కెవరనే ప్రశ్నలు వస్తున్నాయి.అడ్డగోలు విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఏపీకి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాంత రైతులు వేలాది ఎకరాల భూమిని త్యాగం చేసిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి నగర నిర్మాణం వేగంగ జరుగుతున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీకి ఓటమి అంటగట్టి, ఒక్క చాన్స్ అంటూ అందరినీ కాళ్లా వేళ్లాపడి వేడుకున్న జగన్ రెడ్డికి జనం పట్టం కట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకే వెళ్లిపోతుందనే దురాలోచనతో దాన్ని పక్కన పెట్టేశారు జగన్. ఆపై మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. దరిమిలా జరిగిందేమిటంటే.. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా రాజధాని ఏదో తెలియని అనిశ్చితిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఇదే జగన్ లోని కపట మనస్తతత్వానికి అద్దం పడుతోందంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌కు అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ ఆ ప్రాంత రైతులు రెండేళ్ళకు పైగా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్నా జగన్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యమిస్తున్న రైతులతో ఒక్కసారి కూడా చర్చించి, సమస్య పరిష్కారం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. పైగా ఉద్యమిస్తున్నా అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించారు. అనేక మంది రైతులను అరెస్టులు చేయించారు. అడుగడుగునా ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ రెడ్డి సర్కార్ చేయని ప్రయత్నం లేదు. సభ పెట్టుకోనివ్వలేదు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. చివరాఖరికి జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ నుంచి సచివాలయానికి, అసెంబ్లీకి సెక్యూరిటీ లేకుండా వెళ్లే ధైర్యం కూడా లేదు.మూడు రాజధానుల బిల్లును కోర్టు మొట్టికాయలు వేయడంతో ఉపసంహరించుకున్న జగన్.. మరింత పకడ్బందీగా మరో బిల్లు తెస్తామని చెప్పడం ఆయనలోని జగమొండి తనానికి నిదర్శనం అంటున్నారు. సినిమా టికెట్ల వ్యవహారంపై సినీ పెద్దలతో ఆగమేఘాల మీద చర్చించడం, సమస్య పరిష్కారం కోసం కమిటి వేయడం లాంటి చర్యలు చేపట్టిన జగన్ అమరావతి రైతుల ఆందోళనపై ఎందుకు స్పందించరంటూ నిలదీస్తున్నారు