నెల్లూరు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 నింగిలోకి దూసుకెళ్లింది. పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం ఇందుకు వేదికైంది. మూడు ఉపగ్రహాలతో పాటు..ఈవోఎస్-04, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను..రోదసిలోకి పీఎస్ఎల్వీ- సీ52 మోసుకెళ్లింది. 1,710 కిలోల ఆర్ఐ(ఈవోఎస్-04), 17.50 కిలోల ఐఎన్ఎస్-2టీడీ..8.10 కిలోల ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను రోదసిలోకి రాకెట్ తీసుకెళ్లింది.
ఈ ప్రయోగం కోసం ఆదివారం తెల్లవారుజామున 4:29 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించారు. ఆదివారం రాకెట్లోని 2, 4 దశల ద్రవ ఇంధన మోటార్లకు ఇంధనాన్ని నింపే కార్యక్రమం చేపట్టారు. అనంతరం రాత్రి 1, 3 దశల ఘన ఇంధన మోటార్లకు గ్యాస్ నింపే చర్యలు చేపట్టారు.
ఇస్రో ప్రయోగించిన ఈ ఈవోఎస్-04 శాటిలైట్ ఎలాంటి వాతావరణంలోనైనా భూఉపరితల చిత్రాలను స్పష్టంగా తీసి పంపించే సామర్ధ్యం వుంది. వ్యవసాయ, అటవీ, వరదల సమాచారంతోపాటు జలవనరుల స్థితిగతులు, నేలలోని తేమ వివరాలను కూడా తెలియజేస్తుంది.