హైదరాబాద్, ఫిబ్రవరి 14,
ఎప్పటినుంచో ఆరోపణలు. ఎప్పటినుంచో గుసగుసలు. బీజేపీ, టీఆర్ఎస్ దొందుదొందేనని కాంగ్రెస్ విమర్శలు. కాంగ్రెస్, టీఆర్ఎస్ తోడుదొంగలనేది బీజేపీ ఆరోపణలు. ఇంతకీ, టీఆర్ఎస్ ఎవరివైపు? బీజేపీ వైపా? కాంగ్రెస్‌తో కుట్రా? కాంగ్రెస్‌పై కుట్రా? అనేది క్లారిటీ ఇచ్చేశారు కేసీఆర్. లేటెస్ట్ ప్రెస్‌మీట్‌లో.. సూటిగా, సుత్తిలేకుండా బీజేపీ, కాంగ్రెస్‌లతో తమ వైఖరి ఎలా ఉండబోతోందో తేల్చి చెప్పారు. రాహుల్‌గాంధీపై అసోం సీఎం చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు చేయాలిగానీ, మరీ ఇంత నీచంగా వ్యక్తిగతంగా దిగజారుడు మాటలు మాట్లాడమేంటని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం సీఎం కామెంట్లను గట్టిగా ఖండించారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై సాక్షాలు చూపాలంటూ రాహుల్‌గాంధీ చేసిన డిమాండ్‌నూ సపోర్ట్ చేశారు. అవును, రాహుల్‌గాంధీ చేసిన డిమాండ్‌లో తప్పేంటి? తాను కూడా సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు అడుగుతున్నా..చూపించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని.. కాంగ్రెస్ స్టాండ్‌నే తనూ వినిపించారు. రఫేల్ డీల్‌లో భారీ అవినీతి జరిగిందంటూ, కాంగ్రెస్‌లానే తామూ బీజేపీ అవినీతిపై పోరాడుతామని చెప్పారు.ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ బీజేపీని ఎంతగా విమర్శించారో.. కాంగ్రెస్‌నూ అంతగానే సమర్ధించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కేంద్రంలో బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ఉందంటూ.. బీజేపీ లేని దేశం కావాలంటూ.. నినదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటారా? అని మీడియా ప్రతినిధులు కేసీఆర్‌ను ప్రశ్నించగా ఆయన తనదైన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తును ఏమాత్రం ఖండించలేదు కేసీఆర్. కాంగ్రెస్, టీఆర్ఎస్ టైఅప్ అంటూ బీజేపీనే ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే, బీజేపీని తరిమికొట్టడానికి అంతా కలవాల్సిన అవసరం ఉందన్నారు. పొత్తులు అనేవి తర్వాత నిర్ణయం.. ఇప్పుడే దాన్ని ఎవరూ ఊహించలేరు.. ఎవరు ఎవరిని కలుస్తారో.. జరిగేదేదో జరుగుద్ది.. ముందైతే బీజేపీని గద్దె దించాల్సిందే.. అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. అవసరమైతే తాను కొత్త జాతీయ పార్టీ పెడతానని.. పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేలతో మాట్లాడుతున్నానని చెప్పారు. అయితే, ఎక్కడా నేరుగా కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని చెప్పకున్నా.. అవసరమైతే, బీజేపీని దెబ్బకొట్టేందుకు భవిష్యత్తులో కలిసి పనిచేసే ఛాన్స్ ఉందన్నట్టు మాట్లాడారు గులాబీ బాస్. అవుననకుండా.. కాదనకుండా.. మీడియాకు, ప్రజలకు మంచి మసాలా ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలు అందరికంటే తెలంగాణ కాంగ్రెస్‌కు, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఇబ్బంది తెచ్చిపెట్టేవే అంటున్నారు. గులాబీ బాస్ కావాలనే కాంగ్రెస్ సైడ్ మాట్లాడారా? అనే అనుమానమూ వినిపిస్తోంది. కేసీఆర్ మాటల తర్వాత ఇక కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే అంటూ బీజేపీ నేతలు రెచ్చిపోవడం ఖాయం. ఇది రేవంత్‌రెడ్డి దూకుడుకు ఇరకాటం. ఆ రెండు పార్టీలు జట్టు కట్టబోతున్నాయనే మెసేజ్ ప్రజల్లోకి వెళితే.. అది కాంగ్రెస్‌కు బిగ్ మైనస్.. అదే టైమ్‌లో బీజేపీకి ప్లస్ అవుతుంది. ఈ లెక్క బాగా తెలిసిన కేసీఆర్.. ప్రజల్లోకి అలాంటి మెసేజ్ వెళ్లాలనే.. కాంగ్రెస్‌ను డ్యామేజ్ చేయాలనే.. రేవంత్ దూకుడుకు బ్రేకులు వేయాలనే.. బీజేపీ-బండి జోరు పెంచాలనే.. ఇలా హస్తం పార్టీపై సాఫ్ట్ అండ్ సెంటిమెంట్ కామెంట్లు చేశారనే వాదనా ఉంది.మరోవైపు, నిజంగా భవిష్యత్తులో, ఎన్నికల తర్వాత.. బీజేపీని గద్దెదించేందుకు కేసీఆర్ కాంగ్రెస్‌తో జట్టు కడితే..? అది రేవంత్‌రెడ్డికి మరింత షాక్. ఎందుకంటే, కేసీఆర్‌ను ఒక్కరోజైనా జైల్లో పెట్టాలనే కసితో కొట్లాడుతున్నారు రేవంత్‌రెడ్డి.