గుంటూరు
నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2వతేదీ నుంచి కొత్త జిల్లాలు కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. తొలుత తాత్కాలిక కార్యాలయాల నుంచి పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన భవనాలు, ఖాళీ స్థలాలు, ప్రైవేట్ భవనాల కోసం ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని సబ్ కమిటీ ఇప్పటికే పూర్తి సమాచారాన్ని సేకరించింది. కొత్త జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని స్థిరాస్తుల సమాచారంతో ఒక నివేదిక రూపొందించింది. ఈ వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపి పరిశీలించాలని సూచించింది. దీన్ని బట్టి కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.