యాదాద్రి భువనగిరి
బెల్టు షాపులపై సమరభేరీ మోగించారు కాలనీవాసులు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎల్బి నగర్ కాలనీలో అక్రమంగా వెలసిన బెల్టుషాపులను వెంటనే మూసివేయాలని కాలనీవాసులు ర్యాలీ నిర్వహించారు. కుటుంబాలతో నివాసం ఉండే కాలనీలో ఇళ్ల మధ్య బెల్టుషాపులను నిర్వహించడంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్య బెల్ట్ షాపు నిర్వహించడం సరైంది కాదని, వెంటనే వాటిని మూసివేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి బెల్టుషాపుల వ్యవహారాన్ని తీసుకెళ్లినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా నిర్వహిస్తున్న బెల్టు షాపుల్లో మద్యం తాగి అనారోగ్యానికి గురై ఇదే కాలనీకి చెందిన ఒకరు మరణించారని కాలనీవాసులు గుర్తుచేశారు. ఎల్బీనగర్ కాలనీవాసుల భారీ ర్యాలీతో భువనగిరి పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయింది. అధికారుల సహకారంతోనే కాలనీలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఎల్బీ నగర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోకపోతే నేరుగా కోసం రంగంలోకి దిగుతామని హెచ్చరించారు.