YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యూపీ వెర్సస్ కేరళ... మాటల మంటలు

యూపీ వెర్సస్ కేరళ... మాటల మంటలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14,
బీజేపీకి ఓటు వేయకపోతే ఉత్తరప్రదేశ్ కూడా కేరళ, కశ్మీర్ లేదా పశ్చిమ బెంగాల్‌ గా మారుతుందంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌  చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ యోగీ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌ కేరళలా మారిపోతే ప్రజలకు మంచి విద్య, నాణ్యమైన వైద్య సేవలు, సామాజిక సంక్షేమం, మంచి జీవన ప్రమాణాలు, మతాలు, కులాల పేరిట హత్యల్లేని ఓ సామరస్య సమాజం ఏర్పడుతుందన్నారు. యూపీ ప్రజలు ఇలాంటి పాలననే కోరుకుంటున్నారంటూ యోగీకి చురకలు అంటించారు. ఇదే సందర్భంగా తమ ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను విజయన్‌ వెల్లడించారు. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా రూ.17, 183 కోట్ల వ్యయంతో 1, 557 ప్రాజెక్టుల్లో భాగంగా 53 కొత్త పాఠశాల భవనాలను ప్రారంభించినట్లు కేరళ సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ. 5వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఫలితంగా 9.34 లక్షల కొత్త అడ్మిషన్లు వచ్చాయని యూపీ సీఎంకి వివరాలతో సహా కౌంటర్‌ ఇచ్చారు విజయన్‌.తలసరి ఆదాయం విషయంలో దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే కేరళ రాష్ట్రం దిగువనే ఉంది. అయితే విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, లింగ సమానత్వం తదితర విషయాల్లో మాత్రం దేశంలోనే మెరుగైన స్థానంలో ఉంది. ఇదే సమయంలో యూపీ కేరళకు అందనంత దూరంలో ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ గణంకాల ప్రకారం.. కేరళ తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 2019-20లో రూ.2.2 లక్షలుగా ఉంది. ఇది యూపీ కంటే మూడు రెట్లు అధికం. ఇక నేషనల్‌ శాంపిల్‌ సర్వే అంచనా ప్రకారం యూపీతో పోల్చితే కేరళలో జీవన ప్రమాణాలు కూడా ఎంతో మెరుగ్గా ఉన్నాయి. 2011-12 సర్వే ప్రకారం కేరళ జనాభాలో మొత్తం 7 శాతం మంది మాత్రమే దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. యూపీ విషయానికొస్తే ఇది 29 శాతంగా ఉంది. ఇక నీతి అయోగ్‌ నివేదించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015-16) డేటాను విశ్లేషిస్తే.. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల సూచికల్లో ఉత్తరప్రదేశ్‌ కంటే కేరళ రాష్ట్రం ఎంతో మెరుగ్గా ఉంది. ఈ డేటా ప్రకారం కేరళలో సరైన జీవన ప్రమాణాలు లేని పేదలు కేవలం 0.7శాతం మాత్రమే. ఇదే సమయంలో యూపీలో 38 శాతం మంది పేదలు మెరుగైన జీవన ప్రమాణాలకు దూరంగా ఉన్నారు.ఇక 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం అక్షరాస్యతలో కేరళ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. కేరళలో 15-49 ఏళ్ల మధ్యగల వయసు గల స్త్రీ పురుషులలో దాదాపు 97 శాతం మంది చదువుకున్నవారే. యూపీలో ఇది కేవలం 66 శాతం మాత్రమే. ఈ వ్యత్యాసం తక్కువగా ఉన్నప్పటికీ కేరళ ఈ విషయంలో ఎంతో మెరుగ్గా ఉంది. ఆరోగ్య సూచికల విషయానికొస్తే.. కేరళలో శిశుమరణాల రేటు 1000 మందికి 4.4 గా ఉంటే.. యూపీలో ఇది 50.4గా ఉంది. యూపీతో పోల్చితే కేరళ ప్రజల సగటు ఆయుర్దాయం కూడా ఎక్కువే. కేరళ ప్రజల సగటు ఆయుర్దాయం సుమారు 75 ఏళ్లు కాగా.. యూపీలో మాత్రం 65 సంవత్సరాలే..కరోనా మరణాలు కూడా తక్కువే.. దేశంలో కరోనా కారణంగా కేరళ రాష్ట్రం బాగా ప్రభావితమైంది. అక్కడ కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడంతో అక్కడ కరోనా మరణాలు చాలా తక్కువేనని నివేదికలుచెబుతున్నాయి. ఇక మహమ్మారి కాలంలో కార్మికుల వలసలను అరికట్టడానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు సీఎం విజయన్‌. పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా ఆన్‌లైన్‌ క్లాసులు జరిగేలా చర్యలు తీసుకున్నారు.

Related Posts