హైదరాబాద్, ఫిబ్రవరి 14,
సర్జికల్ స్ట్రైక్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆయన మాటలకు కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌తో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ఆ కారణంగానే తెంలంగాణ సీఎంలో ఆగ్రహం, ఉద్వేగం కనిపిస్తోందంటూ సెటైర్లే వేశారు. ఇప్పుడు ఒక్క ఎన్నికల్లో ఓడిపోయాం.. రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం చేజారుతుందనే భయంతోనే ఆయన ఇలాంటి అర్థం లేని కామెంట్స్ చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి ఠాకూర్ ఫైర్ అయ్యారు. అంతేకాదు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మాటలు పాకిస్తాన్ మాటలను తలపిస్తు్న్నాయంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక రచ్చ క్రియేట్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అభివృద్ధి విషయంలో బీజేపీతో పోటీ పడలేక కొందరు హిజాబ్ అంటున్నారు.. మరికొందరు సర్జికల్ స్ట్రైక్స్ అంటున్నారని తూర్పారబట్టారు.సర్జికల్ స్ట్రైక్‌పై కేసీఆర్ ఏమన్నారంటే.. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ప్రూఫ్స్ ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి తాను కూడా మద్దతిస్తున్నానని అన్నారు. ‘‘సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రూఫ్స్ రాహుల్ గాంధీ అడగడం కాదు.. నేనే కూడా అడుగుతున్నాను. రాహుల్ గాంధీ అడిగినదాంట్లో ఏమాత్రం తప్పు లేదు.’’ అని బీజేపీపై ధ్వజమెత్తారు.