కర్నూలు, ఫిబ్రవరి 15,
భూమా జగత్.. ఇప్పుడు ఈ పేరు కర్నూలు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యింది. తండ్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు జగత్ రాజకీయాలలో దూకుడు పెంచాడు. తండ్రి ద్వారా వచ్చిన మాస్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్న జగత్.. అంతే స్థాయిలో వివాదాస్పదంగా మారుతున్నాడు. దివంగత భూమా శోభా నాగిరెడ్డి తనయుడే జగత్ విఖ్యాత్ రెడ్డి. 2014లో రోడ్డు ప్రమాదంలో తల్లి శోభానాగిరెడ్డి ప్రాణాలు కోల్పోయినప్పుడు జగత్ వయసు కేవలం 15 సంవత్సరాలు. శోభ మృతిచెందిన మూడేళ్లకే 2017 లో భూమా మృతి చెందారు. అప్పటికి జగత్ వయసు కేవలం 18 ఏళ్లు. ప్రస్తుతం 23 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే యూత్, మాస్, కాంట్రవర్సీ.. లీడర్‌గా జగత్ కర్నూలు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యాడు.తన అక్క అఖిల ప్రియ కంటే ఎక్కువగా మాస్ లీడర్ గా గ్రామాలను చుట్టేస్తున్నారు. అంతే స్థాయిలో వివాదాస్పద నాయకుడిగా మారాడు. ఇంత చిన్న వయసులోనే అనేక పెద్ద కేసులు జగత్‌పై కేసులు నమోదు అవడం ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ శివార్లలో భూవివాదంలో అక్క బావలతో పాటు జగత్‌పైనా కిడ్నాప్ కేసు నమోదైంది. అంతకుముందే ఆళ్లగడ్డలో ఓ కేసులో అరెస్ట్ అయిన టిడిపి నేతలను పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ విషయంలో కూడా జగన్ పై కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో వివాదంలో జగత్ చిక్కుకున్నాడు. రోడ్ల విస్తరణలో భాగంగా ఆళ్లగడ్డ నాలుగురోడ్ల సర్కిల్లో తన తండ్రి పేరు మీద ఉన్న బస్ షెల్టర్ ని మునిసిపల్ అధికారులు కూల్చివేశారు.దీనిపై ఆగ్రహించిన జగత్.. భారీ జన సమీకరణతో వెళ్లి కూల్చివేతలు అడ్డుకున్నాడు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు తావిచ్చింది. కాంట్రాక్టర్ నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో జగన్‌పై మరో కేసు నమోదైంది. అతనితోపాటు మరో 17 మందికి పైగా టిడిపి నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా జగత్‌పై మరికొన్ని కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది. భూమా నాగిరెడ్డి కూడా చిన్న వయసులోనే మాస్ లీడర్ గా ఎదిగారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో మొదటిసారిగా భూమా నాగిరెడ్డి పోటీ చేసినప్పుడు జరిగిన ఘర్షనలు అందరికీ గుర్తున్నాయి. అప్పట్లో ఆయన అతి చిన్న వయస్కుడు. ఈసారి కూడా రానున్న ఎన్నికలలో ముందస్తుగా కాకుండా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఆళ్లగడ్డ లేదా నంద్యాల నుంచి బరిలోకి దిగాలని జగత్ ప్రయత్నిస్తున్నాడు. గత ఎన్నికలలో ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పోటీ చేసిన అఖిల ప్రియ, ఆమె అన్న బ్రహ్మానంద రెడ్డి లు మరోసారి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా జగత్ దూకుడు జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశమైంది. మాస్ ఇమేజ్ ఉన్న జగత్ ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని కార్యకర్తల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. జగత్ రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో తేలనుంది