కాకినాడ, ఫిబ్రవరి 15,
కరోనా మొదటి రెండో దశ కారణంగా రెండేళ్లుగా ఆర్థికంగా చితికిపోయిన కొబ్బరి రైతుకు మరో కష్టం ఎదురైంది. జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో ధరలు మరింత పతనమయ్యాయి. కరోనా వ్యాప్తికి ముందు వెయ్యి కాయల ధర రూ.17వేల వరకు పలికింది. ప్రస్తుతం వెయ్యికాయల ధర రూ.8,000కు మించట్లేదు. అంటే దాదాపుగా సగానికిపైగా ధర పడిపోయింది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో కొత్త కొబ్బరి క్వింటాలు రూ.7వేల నుంచి రూ.8,500 మధ్యలో ఊగిసలాడుతోంది. గతేడాది డిసెంబర్ కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి కనీస మద్దతు ధర రూ.10,335గా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ధర కూడా అమలు కాకపోవడంతో కింటాకు రూ.1,835 వరకూ రైతులు నష్టపోతున్నారు. కనీసం క్వింటా కొబ్బరికి రూ.13వేలు చెల్లిస్తే గాని గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. కురిడీ, ఎండు కొబ్బరి ధర గతంలో క్వింటా రూ.17వేల నుంచి రూ.18వేల వరకూ పలికింది. ప్రస్తుతం గండేరా పాత రకం, కురిడీ కొబ్బరి ధర క్వింటా రూ.12,500, గటగట రకం క్వింటా రూ.11వేలకు పడిపోయాయి. కొత్తకాయల నుంచి తీసిన ఎండు కొబ్బరి ధర క్వింటా రూ.10వేలు మాత్రమే పలుకుతోంది. ఎండుకొబ్బరిపై క్వింటాకు రూ.6వేల నుంచి రూ.8వేల వరకూ తగ్గిపోయింది.తూర్పుగోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. మరో 20 వేల ఎకరాలకు సరిపడా చెట్లు ఇళ్ల వద్ద, పొలాల గట్ల వెంబడి, కాలువ గట్లపైన ఉన్నాయి. ప్రతియేటా జిల్లాలో 105 కోట్ల కొబ్బరి కాయల దిగుబడి వస్తుందని అంచనా. వీటిలో 90 కోట్ల కొబ్బరి కాయలు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం 50 కోట్ల కొబ్బరికాయులు కూడా ఎగుమతి కావట్లేదు. దిగుబడి తగ్గడం, కేరళ, కర్నాటక రాష్ట్రాల కాయలతో పోల్చితే ఇక్కడ కాయలు సైజు తక్కువగా ఉండడంతో జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గింది. ఎగుమతులు మందగించాయి. తమిళనాడు, కేరళలో దిగుబడి ఎక్కువగా ఉండడంతో ఫిబ్రవరిలో కూడా ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ ప్రభావం జిల్లా రైతులపై పడింది. ఎగుమతులు లేక, మద్దతు ధర లేకపోవడంతో రైతులు నష్టాలబాట పడుతున్నారు.పచ్చి కొబ్బరి కాయలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూ.13వేల ధర వస్తేనే గట్టెక్కుతాం. ప్రస్తుతం రూ.7,500 మించడం లేదు. కూలీ, రవాణా ఖర్చులు కూడా రావట్లేదు. ధలేకపోవడంతో కూలీ పనికి వెళ్లాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు