YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెరిగిపోతున్న ద్రవ్యలోటు

పెరిగిపోతున్న ద్రవ్యలోటు

విజయవాడ, ఫిబ్రవరి 15,
సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు కొండలా పేరుకుపోయింది. ఏపీకి వచ్చిన ఆదాయం కంటే రెవెన్యూ ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో రెవెన్యూ లోటు 900 శాతం దాటేసిందని గణాంకాలు చెబుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలకు సంబంధించిన గణాంకాలు తేలిపోయాయి.అసెంబ్లీకి బడ్జెట్ సమర్పించినప్పుడు ఏపీ రెవెన్యూ లోటును 5 వేల కోట్లు మాత్రమే ఉంటుందని లెక్కగట్టింది వైసీపీ సర్కార్. దాని ప్రకారమే రెవెన్యూ రాబడిని, ఖర్చులను సమన్వయం చేసేలా బడ్జెట్ ప్రతిపాదన జరిగింది. అయితే.. డిసెంబర్ నెల చివరితో ముగిసిన 9 నెలల కాలంలో రెవెన్యూ లోటు ఏకంగా 45 వేల 907 కోట్లుగా లెక్క తేలింది. అంటే బడ్జెట్ అంచనాల కన్నా రెవెన్యూ లోటు 918 శాతం మేరకు పెరిగిపోయిందన్నమాట. అయితే.. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి రెవెన్యూ లోటు నాటి అంచనాలతో పోల్చితే.. కేవలం 270 శాతం మాత్రమే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు క్రమంగా మెరుగవుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని, పన్నేతర ఆదాయాన్ని, కేంద్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని కలిపి రెవెన్యూ రాబడిగా లెక్కవేస్తారు. అలా రెవెన్యూ రాబడి ఈ ఏడాది సుమారు లక్ష కోట్లకు చేరిందని గణాంకాలు చూస్తే స్పష్టం అవుతుంది. ఈ 9 నెలల్లో కేంద్రం నుంచి గ్రాంటుగా 25 వేల 246 కోట్లు వచ్చింది. దీనితో కలిపి ఏపీ రెవెన్యూ రాబడి 97 వేల 887 కోట్లకు చేరింది.ఏపీలో రెవెన్యూ లోటే కాకుండా అప్పులు కూడా భారీగా పెరిగిపోతుండడం గమనార్హం. మొదటి 9 నెలల్లో వైసీపీ సర్కార్ ఏకంగా 58 వేల 111 కోట్ల రూపాయలు అప్పుగు సమీకరించింది. బడ్జెట్ అంచనాల్లో కేవలం 37 వేల 029 కోట్ల రుణంతోనే ఈ ఆర్థిక సంవత్సరాన్ని గట్టెక్కించేయాలని జగన్ సర్కార్ అనుకుంది. కానీ.. ఇప్పటికే అప్పు అంచనాలకు మించిపోయి 156 శాతానికి చేరిపోవడం ఆందోళన కలిగించే అంశం అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఏపీకి వచ్చే సొంత ఆదాయానికి దరిదాపుల్లో అప్పు చేసేసిన పరిస్థితులు ఉన్నాయి. జీఎస్టీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ ట్యాక్స్, కేంద్ర పన్నుల్లో వాటాలు, ఇతర పన్నులు కలిపి ఏపీకి ఈ 9 నెలల్లో 69 వేల 943 కోట్లు ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో ఏపీ సర్కార్ చేసిన అప్పు 58 వేల కోట్లకు పైగా ఉందని లెక్కల్లో తేలుతోంది.అనాలోచిత చర్యలు, అదుపూ అడ్డూ లేని ఖర్చులు, దొరికిన కాడికి తెచ్చిన అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీలు, ఆస్తుల అమ్మకాలు, చివరికి పార్కుల్ని కూడా తాకట్టు పెట్టేసే స్థాయికి దిగజార్చిన వైసీపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును పణంగా పెడుతోందనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి.

Related Posts