విశాఖపట్టణం ఫిబ్రవరి 15,
ప్రజలంతా ఒక్కటై తగ్గేదే లే అంటే.. ఎవరైనా తగ్గాల్సిందే. అదీ ప్రభుత్వమైనా.. ఏ ప్రభుత్వ సంస్థ అయినా. తాజాగా ప్రజలు దెబ్బకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) బస్సు ఛార్జీలను తగ్గించింది. ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా తగ్గిపోతుండడంతో ఆర్టీసీ బస్సు సర్వీసుల ఛార్జీలను తగ్గిస్తూ సదరు సంస్థ నిర్ణయం తీసుకుంది.సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి దూరప్రాంతమైన హైదరాబాద్ వెళ్లే బస్సు సర్వీసులకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. నిత్యం తిరిగే బస్సు సర్వీసులు ఖాళీగా వెళుతుండడంతో ఆర్టీసీకి భారీగా నష్టాలు వస్తున్నాయి. వీటికి తోడు ప్రైవేటు బస్సు సర్వీసులు ఆన్‌లైన్‌లో టిక్కెట్టు ధరలను పరిస్థితులను బట్టి తగ్గిస్తుండడంతో ఆ సర్వీసులకు ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు.ఈ నేపథ్యంలో ప్రైవేటు బస్సు సర్వీసుల పోటీని తట్టుకోవాలంటే.. ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించడం మినహా మరో మార్గం లేదని ఏపీఎస్ఆర్టీసీ భావించింది. దాంతో హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల ఛార్జీలను తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఓ నిర్ణయం తీసుకుంది.అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రాజోలు, రావులపాలెం తదితర డిపోల నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు సర్వీసుల ధరల్లో మార్పులు చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అమలాపురం నుంచి బీహెచ్‌ఈఎల్ వెళ్లే అమరావతి బస్సు సర్వీసు టికెట్ ధర గతంలో 1160 రూపాయిలు ఉండేది. కానీ ఆ టిక్కెట్టు ధరను తాజాగా 955 రూపాయిలకు తగ్గించారు. అలాగే బీహెచ్‌ఈఎల్ నుంచి అమలాపురం వెళ్లే అమరావతి సర్వీసు గతంలో 1205 రూపాయిలు ఉంటే.. ఆ ధరను తాజాగా 990 రూపాయిలకు తగ్గించాంరు. అదే విధంగా అమలాపురం నుంచి వయా భీమవరం మీదుగా ఎంజీబీఎస్ వెళ్లే నైట్‌రైడర్ సర్వీసు టికెట్ ధరను 740 రూపాయిలకు తగ్గించారు. ఇక అమలాపురం నుంచి బీహెచ్‌ఈఎల్ వెళ్లే బస్సు టిక్కెట్టు ధరను 1440 రూపాయిల నుంచి 930 రూపాయిలకి తగ్గించారు. అమలాపురం నుంచి వయా భీమవరం మీదుగా వెళ్లే నైట్‌రైడర్ బెర్త్ టిక్కెట్ ధర 1140 రూపాయిల నుంచి 930 రూపాయిలకు తగ్గించారు.మరోవైపు టీఎస్‌ఆర్టీసీ కూడా బస్సు రేట్లను తగ్గించింది. గరుడ బస్సు చార్జీలను హైదరాబాద్, విజయవాడ మధ్య సర్వీసుకు 100 రూపాయిల మేర ధర తగ్గించారు. ప్రైవేటు బస్సు సర్వీసులు ప్రయాణికుల రద్దీని బట్టి టిక్కెట్టు ధరలను ఆకస్మికంగా తగ్గిస్తుండడంతో ఆ బస్సు సర్వీసులకు కూడా భారీగా డిమాండు పెరిగింది.సంక్రాంతి పండుగ తర్వాత అటు ఆర్టీసీ, ఇటు ప్రైవేటు సర్వీసులకు ప్రయాణికుల రద్దీ భారీగా తగ్గిపోతోంది. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకోంటున్నారు. ముఖ్యంగా కొవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని రోడ్డు రవాణా సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఛార్జీలు పెంచితే.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందనే ఆందోళనలో ప్రభుత్వాలు అయితే ఉన్నాయి. రానున్నది ఎన్నికల సీజన్. ఛార్జీలు పెంచితే.. ప్రజల నుంచి దెబ్బతప్పదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలి.. ఆర్టీసీని లాభాల బాటలోకి ఎలా తీసుకురావాలని.. ఆ క్రమంలో ప్రయాణికులను ఎలా ఆకట్టుకోవాలనే అనే ప్రయత్నంలో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నధికారులు .. తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు