హైదరాబాద్, ఫిబ్రవరి 15,
మంత్రి తలసానికి టీఆర్ఎస్ పార్టీలో ప్రయారిటీ పెరిగింది. కేసీఆర్, కేటీఆర్ తర్వాత ఆయనకే ప్రాధాన్యత లభిస్తున్నది. పార్టీ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేసుకుంటున్నారు. మొన్న ముచ్చింతల్, ఇక్రిశాట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికి వెంట నడిచారు. నిన్న రాష్ట్రపతికి సైతం సీఎం కేసీఆర్‌తో కలిసి స్వాగత కార్యక్రమంలో తొలి వరుసలో నిలిచారుగ్రేటర్‌లో నలుగురు మంత్రులు ఉన్నప్పటికీ తలసానికే కేసీఆర్ పెద్ద పీట వేశారు. హఠాత్తుగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం పార్టీ సీనియర్ నేతల్లోనూ చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల వరకూ ఇదే ప్రాధాన్యత కొనసాగుతుందేమోననే చర్చలు జరుగుతున్నాయిపార్టీలోకి లేటుగా వచ్చినా కీలక బాధ్యతలు అప్పజెప్పి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. గ్రేటర్ పరిధిలో పార్టీ పనుల బాధ్యతల్లో ఆయనే ముందుంటున్నారు. కేసీఆర్‌కు ప్రధాన అనుచరుల్లో ఒకరిగా మారారు. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన తలసానికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. రెండో టర్ములోనూ అదే మంత్రిత్వశాఖను నిర్వహిస్తున్నారు. జంటనగరాల్లో పార్టీని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించి కేసీఆర్ నజర్‌లో పడ్డారు. ఆయనతో పాటు నగరానికి చెందిన ముగ్గురు మంత్రులు (మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి) ఉన్నా ప్రత్యేక గుర్తింపు పొందారు.ఈ నెల 17న సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించే బాధ్యతలను సైతం ఆయనే భుజాన వేసుకున్నారు. 15న అన్నదానం, ఆసుపత్రులు, వృద్దాశ్రమాల్లో పండ్ల పంపిణీ, దుస్తులు పంపిణీ, 16న రక్తదాన శిబిరాలు, 17న కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో వేడకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ భవన్‌ను బెలూన్లు, పూలతో అలంకరించే ఏర్పాట్లను దగ్గరుండి చేయిస్తున్నారు. కేసీఆర్ జీవిత చరిత్రను తెలియజేసేందుకు త్రీ-డీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్టులతో రూపొందించిన హిందీ డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు.కేసీఆర్ ఉద్యమ చరిత్ర, సంక్షేమ పరిపాలనను వివరించేలా 2-డీ డిస్‌ప్లేలను ఏర్పాటు చేయిస్తున్నారు. సర్వమత ప్రార్థనలు, సనత్‌నగర్ నియోజకవర్గంలో ఉజ్జియిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయుష్షు హోమం, చీరల పంపిణీ, బల్కంపేట ఎల్లమ్మకు బంగారు జడ, నాంపల్లిలోని దర్గాలో చాదర్, అమీర్పేట గురుద్వార్‌లో హర్దాస్, సికింద్రాబాద్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనాలు నిర్వహించేందుకు తలసాని ఏర్పాట్లు చేశారు.పార్టీ తరపున జరిగే ఏ కార్యక్రమం అయినా చొరవ తీసుకుని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ అదే తీరును ప్రదర్శిస్తున్నారు. అనూహ్యంగా తలసానికి పార్టీలో, మంత్రివర్గంలో, బాధ్యతల్లో ప్రాధాన్యత పెరగడాన్ని శ్రేణులూ చర్చించుకుంటున్నాయి. దీన్ని గమనించిన పార్టీ కార్యకర్తలు సైతం వారివారి అవసరాల కోసం తలసానిని ప్రసన్నం చేసుకోడానికి పాట్లు పడుతున్నారు. జంటనగరాల్లో జరిగే పార్టీ కార్యక్రమాలకు అనధికారికంగా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.