వరంగల్, ఫిబ్రవరి 15,
నిరుద్యోగుల సంఖ్యలో 40,994 మందికి కష్టకాలం ఎదురైంది. 2018 వరకు టీఎస్పీఎస్సీలో వన్టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు 24.62 లక్షల మంది ఉండగా.. వారిలో 40,994 మంది గతేడాది డిసెంబర్ వరకు 44 ఏండ్లు దాటిపోయారు. 2018 నుంచి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో వీరంతా ఎదురుచూపుల్లోనే కాలం వెళ్లదీశారు. దీంతో అన్ని రకాల ఉద్యోగాలకు 40,994 మంది పూర్తిగా అర్హత కొల్పోతే.. మరో 1.05 లక్షల మంది యూనిఫాం సర్వీసెస్కు అనర్హులువుతున్నారు. దీంతో రాష్ట్రంలో లక్షన్నర మంది కొలువుల అర్హతకు దూరమవుతున్నారు.రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఘోరంగా మారింది. ముందుగా కరోనా ప్రభావం, జోనల్ వ్యవస్థ, పోస్టుల వర్గీకరణ, ఉప ఎన్నికలు, మండలి, జీహెచ్ఎంసీ ఎన్నికలు వంటి పలు కారణాలతో మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు. 2018 నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రకటించలేదు. గ్రూప్ – 1, గ్రూప్ – 2, గ్రూప్ – 3, గ్రూప్ -4లతో పాటు పోలీసు శాఖలో ఉన్న ఖాళీలు, టీచర్ల ఖాళీలకు సైతం నోటిఫికేషన్ల ప్రకటన రాలేదు. ఈ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం రెండేళ్లుగా చెబుతున్నా నేటికీ ప్రకటన రాలేదు. గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు దాటిన నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కోల్పోతున్నారు. 2018 నాటికే 40 ఏళ్లు దాటిన వారు 40,994 మంది ఉన్నారని టీఎస్‌పీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా డిసెంబర్ నాటికి 44 దాటి, 45 ఏండ్లలోకి చేరారు.టీఎస్పీఎస్సీ వన్టైం రిజిస్ట్రేషన్లో 35 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు మొత్తం 1,05,325 మంది ఉన్నారు. పోలీసు, యూనివర్సిటీలు వంటి వాటిలో ఉద్యోగాలు ఆశిస్తున్న వారిలో మరో 1.05 లక్షల మంది నిరుద్యోగుల కనీస వయోపరిమితి కూడా దాటింది. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, బోర్డుల ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు మూడేళ్లుగా రాలేదు. పోలీసు విభాగంలో గరిష్ట వయోపరిమితి కానిస్టేబుల్ పోస్టులకు 22 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 25 ఏళ్లుగా ఉంది. దీంతో ఇప్పటికే 25 ఏళ్లు దాటిన వారికి పోలీసు ఉద్యోగం రావడం కష్టమే. టీఎస్పీఎస్సీ లెక్కల ప్రకారం 2018లో 20 నుంచి 25 ఏండ్లు ఉన్న వారు 8.67 లక్షలుగా నమోదై ఉన్నారు. ఇప్పుడు వీరంతా పోలీస్ ఉద్యోగాల ఆశలు వదిలేసుకున్నట్టే. అదేవిధంగా 35 నుంచి 40 ఏండ్లు ఉన్న వారు 1.05 లక్షల మంది ఉండగా.. వీరు కూడా ఇప్పుడు 40 ఏండ్లు దాటిపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, బోర్డుల ఉద్యోగాలకు వీరు అర్హత కోల్పోయినట్టే.ప్రస్తుతం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల వివరాలు తేల్చే పనిలో సిద్ధమయ్యారు. మంగళవారం నాటికి అన్ని శాఖల నుంచి ఖాళీల నివేదిక ప్రభుత్వానికి చేరనుంది. ఈ నేపథ్యంలో కనీసం 50 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే 40,994 మందితో పాటు యూనిఫాం సర్వీసులకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు వయో పరిమితి పెంచితేనే అవకాశాలుంటాయని ఆశిస్తున్నారు. ఇప్పుడు కనీసం ఏడాది, రెండేండ్ల ఏజ్ లిమిట్ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
టీఎస్పీఎస్సీలో నమోదైన నిరుద్యోగుల వివరాలు
వయస్సు పురుషులు స్త్రీలు మొత్తం
20 4,06,731 3,11,433 7,18,164
20=25 5,33,801 3,33,578 8,67,379
25=30 3,02,398 1,94,104 4,96,502
30=35 1,37,729 95,939 2,33,668
35=40 63,277 42,048 1,05,325
40=41 27,725 13,725 40,994
మొత్తం 24,62,032