హైదరాబాద్, ఫిబ్రవరి 15,
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇప్పటికే ప్రతీ మంగళవారం.. ఒక ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల ఇంటి దగ్గర దీక్షలు చేస్తూ వచ్చిన ఆమె.. ఇవాళ టీఎస్‌పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగారు.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఎస్పీఎస్సీ ఆఫీసు దగ్గర ధర్నా చేపట్టారు..మొదట, టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లిన ఆమె.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ మరియు నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు… అనంతరం, ధర్నాకు దిగారు.. ఉద్యోగాలు రాక, యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ లో చలనం లేదంటూ మండిపడ్డారు.. ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకొద్దంటూ నినాదాలు చేసిన ఆమె.. వెంటనే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక, టీఎస్పీఎస్సీ ఎదుట ధర్నాకు దిగిన వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. పీఎస్‌కు తరలించారు.. పోలీసు స్టేషన్ ఆవరణలోనూ ఆమె బైఠాయించి నిరసన తెలిపారు.