గుంటూరు, ఫిబ్రవరి 16,
మొత్తం 3లక్షల మంది ఉద్యోగులు తమకు న్యాయం చేయమని కోరుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు.దీంతో ప్రభుత్వ వర్గాల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది.మొన్ననే ఉద్యోగులతో నిర్వహించిన చర్చలు సఫలీకృతం అయ్యాయని అంతా భావిస్తున్న తరుణాన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో మళ్లీ ఓ పిడుగు లాంటి వార్త జగన్ వర్గాల నెత్తిన పడింది.దీంతో సమ్మె తథ్యం అయితే సంబంధిత వర్గాలు నిరసన ఉద్ధృతం చేస్తే జగన్ కు ఇది ఒక జీవన్మరణ సమస్యగా పరిణమించడం తథ్యం. కొత్త పీఆర్సీ ప్రతిపాదనలకు సంబంధించి మొదట్నుంచి నిరసనలు వ్యక్తంఅవుతూనే ఉన్నాయి.ఇరవై ఏడు శాతానికి పైగా ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఉద్యమించాయి.తరువాత చర్చల్లో భాగంగా 23శాతం ఫిట్మెంట్ విషయం తప్ప మిగిలిన విషయాల్లో కాస్తో కూస్తో ప్రభుత్వం దిగివచ్చింది.అద్దెభత్యం చెల్లింపుల్లో కూడా సంబంధిత శ్లాబుల్లో సవరణలు చేసింది.ఇదే సమయంలో తమ సమస్యలను పూర్తి స్థాయిలో వినిపించలేదు అని అందుకే అవి అపరిష్కృతంగానే ఉండిపోయాయని ఆవేదన చెందుతూ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు.ఉద్యమ కార్యాచరణను సైతం ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి 28 వరకూ జిల్లా స్థాయి సదస్సులు, ఫిబ్రవరి 20లోగా స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, మార్చి6 న విజయవాడలో నిరసన దీక్షలతో పాటు మరికొన్ని నిరసన కార్యక్రమాలకు షెడ్యూల్ ఒకటి వేసుకున్నారు. ఈ క్రమంలో భాగంగా అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సందర్భంగానే మార్చి 28,29తేదీల్లో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.