గుంటూరు, ఫిబ్రవరి 16,
ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత అలీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. జగన్ అలీకి రాజ్యసభ సీటు ను ఖరారు చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇటీవల టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్‌ను కలిసిన పలువురు సినీ ప్రముఖుల్లో అలీ ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసిన అలీకి జగన్ తన ప్రభుత్వంలో స్థానం కల్చించనున్నారన్న వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లే భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ అలీతో ప్రత్యేకంగా మాట్లాడి.. మరో వారం రోజుల్లో మనం మరోసారి కలుద్దామని ప్రత్యేకంగా చెప్పారు. అనుకున్నట్లే మళ్లీ ఇప్పుడు జగన్‌ను కలవడంతో అలీకి రాజ్యసభ సీటు ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఒక స్థానం మైనార్టీ అభ్యర్థికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సీఎం అలీవైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అలీ. వివిధ ప్రాంతాల్లో పర్యటించి పార్టీకి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాక అలీకి ఏదో ఒక పదవి కేటాయిస్తారని ఊహగానాలు వినిపించాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఈక్రమంలోనే రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండడంతో అలీకి సీటు కేటాయించవచ్చని ప్రచారం జరుగుతోంది.