నెల్లూరు, ఫిబ్రవరి 16,
సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి అసహనం అంతా ఇంతా కాదు. ఆనం కుటుంబం కొన్ని దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఆనం నెల్లూరు జిల్లాకే దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల నాటికి కీలక నిర్ణయం తీసుకుంటారంటున్నారు. ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే ఉంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో వెంకటగిరి నియోజకవర్గం శ్రీ బాలాజీ జిల్లాలోకి మారనుంది. వెంకటగిరి సీమ ప్రాంతంలోకి వెళ్లనుంది. ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి లోనే కంటిన్యూ అయితే ఆయనకు, నెల్లూరు జిల్లాకు ఉన్న సంబంధాలు తెగిపోయినట్లే అవుతుంది. మానవ సంబంధాలు కాకపోయినా పుట్టిన నాటి నుంచి నెల్లూరు జిల్లాతో ఉన్న అనుబంధాన్ని ఆయన తెంపేసుకునేందుకు సిద్ధంగా లేరు. ముందు నుంచి ఇది ఆయన ఊహిస్తున్నదే. పార్లమెంటు కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేస్తానని జగన్ ప్రకటన చేసిన నాడే వెంకటగిరి వేరే జిల్లాలోకి వెళుతుందని ఆయన భావించారు. అందుకే పోయిన ఎన్నికల్లోనూ ఆయన వెంకటగిరిలో అయిష్టంగానే పోటీ చేశారు. ఆనం కుటుంబానికి నెల్లూరు రూరల్, నెల్లూరు టౌన్, ఆత్మకూరు నియోజకవర్గంలో బలం ఉంది. వైసీపీలో ఈ మూడు నియోజకవర్గాల్లో కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేకపాటిని కాదని తిరిగి తనకు ఆత్మకూరు నియోజకవర్గం జగన్ ఇస్తారన్న ఆశలేదు. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టౌన్ లో అనిల్ కుమార్ యాదవ్ లు ఉన్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈసారి వెంకటగిరిలో... దీంతో వెంకటగిరిలోనే మరోసారి పోటీ చేస్తే సుదీర్ఘకాలంగా నెల్లూరు జిల్లాతో ఉన్న తమ కుటుంబానికి ఉన్న బంధం తెగిపోతుందని ఆయన భావిస్తున్నారు. మరోసారి వెంకటగిరి నుంచి పోటీ చేసే అవకాశం లేదని ఆనం రామనారాయణరెడ్డి తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలిసింది. మరో పార్టీ నుంచైనా ఆత్మకూరులో బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీలో ఆనంకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం, నెల్లూరు జిల్లాను వీడి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో ఆనం రామనారాయణరెడ్డి ఈసారి ఖచ్చితంగా పార్టీ మారి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారన్న టాక్ వినపడుతుంది.