హైదరాబాద్, ఫిబ్రవరి 16,
రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రాధామ్యాలు రోజురోజుకూ మారిపోతున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి ఆర్థికశాఖ వర్గాలు. ప్రతీనెలా ఖజానాకు వస్తున్న ఆదాయం, సర్కారు ఆ డబ్బును ఖర్చు చేస్తున్న వైనాన్ని పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. అధికారిక లెక్కల ప్రకారం... డిసెంబరు 2021 నాటికి (2021-22 బడ్జెట్‌లో) రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు. మొత్తం బడ్జెట్‌లో ఇది 56శాతం. ఖజానాకు ఇంతమేర నిధులు సమకూరినా రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నిర్దిష్ట తేదీల్లో వేతనాలను చెల్లించలేని దుస్థితి నెలకొనటం గమనార్హం. ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున ప్రతీనెలా ఒకటి నుంచి పదో తేదీ వరకూ విడతల వారీగా వేతనాలను వేస్తూ పోతున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితైతే మరీ ఘోరంగా ఉంది. వారికి కనీసంలో కనీసంగా మూడు నుంచి నాలుగు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉంటున్నాయి. సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చెబుతున్న ధరణి పోర్టల్‌లో పని చేస్తున్న ఆపరేటర్ల జీతాలు కూడా మూణ్నెల్ల పాటు బకాయి పడుతున్నాయి. తమకు పెండింగ్‌లో ఉంచిన వేతనాలను వెంటనే చెల్లించాలంటూ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సోమవారం ఆ శాఖ కమిషనరేట్ వద్ద ధర్నా నిర్వహించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ సిబ్బందికి సైతం ఒక్కో జిల్లాలో ఒక్కో వారంలో వేతనాలు చెల్లిస్తున్న పరిస్థితి. మరోవైపు ఆసరా పింఛన్లు పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది. గతంలో ప్రతీనెలా మొదటి వారంలోగా ఠంఛన్‌గా వచ్చే పింఛన్లు ఇప్పుడు 20వ తేదీ వరకూ 'కొనసాగుతూ...' వసున్నాయి.దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న డబ్బు (జీపీఎఫ్-పార్ట్ ఫైనల్)ను సైతం వారికి సర్కారు సకాలంలో చెల్లించటం లేదు. దీంతో పిల్లల ఉన్నత చదువులు, వారి పెండిండ్ల కోసం ఆ సొమ్ము నిర్ణీత సమయంలో అందకపోవటంతో విశ్రాంత ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించకపోవటంతో ఆ సంస్థ తన అవసరాల కోసం కార్మికులకు చెందిన దాదాపు రూ.1,200 కోట్ల సీసీఎస్ (క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీస్) సొమ్మును వాడుకున్నది. ఈ మధ్యే అందులోంచి రూ.200 కోట్లను చెల్లించింది.
మరోవైపు వివిధ శాఖల పరిధిలో రూ. కోటి నుంచి రూ.10 కోట్ల వరకు సివిల్ నిర్మాణాలను, పనులను పూర్తి చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు సైతం బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు ఆర్థికశాఖ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సీఎం కార్యాలయం నుంచి టోకెన్లు వస్తేగానీ తమకు చెల్లింపులు జరగటం లేదని ఆయా కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ టోకెన్ల కోసం నెలలు, ఏండ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. అదే రూ.100 కోట్లు, ఆ పైబడి పనులు చేసిన బడా కాంట్రాక్టర్లకు, పలుకుబడి కలిగిన వారికి మాత్రం బిల్లులు వెంట వెంటనే విడుదల కావటం గమనార్హం. 'బిల్లుల చెల్లింపు అనేది ఒకే చోట కేంద్రీకృతం కావటం' వల్లే ఈ దుస్థితి తలెత్తుతున్నదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఆర్థికశాఖ పాత్ర నామ్ కే వాస్తేగా తయారైందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సర్కారు చూపు బడా బడా కాంట్రాక్లర్లు, పెద్ద పెద్ద ప్రాజెక్టులపైన్నే ఉంది తప్పితే... వేతన జీవులు, పింఛన్‌దారులు, ఇతరత్రా చిరుద్యోగులపై లేదన్నది స్పష్టమవుతున్నది.