హైదరాబాద్, ఫిబ్రవరి 16
హైదరాబాద్ నగరంలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ మేరకు మలక్‌పేట్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అంత రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10 మంది అంతర్‌రాష్ట్ర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నత విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్నారు. మలక్‌పేటలో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారని.. తల్లితండ్రులకు తెలిసే విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్స్ కొనుగోలు చేస్తున్నారని సీవీ ఆనంద్ తెలిపారు.నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్నారన్నారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సల్టెన్సీ పెట్టాడని.. టెలీకాలర్లు ఫెయిల్ అయిన విద్యార్థులకు కాల్ చేసి వారిని రప్పిస్తున్నారని తెలిపారు. బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే రూ.3 లక్షలు, బీఎస్సీ సర్టిఫికెట్ కావాలంటే రూ.1.7 లక్షలు, బీకాం సర్టిఫికెట్ కావాలంటే రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ సహాయంతోనే ఈ దందా కొనసాగుతుందని హైదరాబాద్ సీపీ పేర్కొన్నారు. SRK యూనివర్సిటీ చైర్మన్ కూడా సంబంధాలు ఉన్నట్లు తేలిందని.. దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ప్రైడ్ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో కూడా మరో ముఠా ఇలాగే దందా చేస్తున్నారన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఒక్కో సర్టిఫికెట్‌ను లక్షల్లో అమ్ముతున్నారని తెలిపారు. SRK యూనివర్సిటీ చెందిన 8 నకిలీ సర్టిఫికెట్లు, మధ్యప్రదేశ్‌లోని స్వామి వివేకానంద యూనివర్సిటీకి చెందిన 24 సర్టిఫికెట్లు, యూపీకి చెందిన గ్లోకల్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల నుంచి రబ్బర్ స్టాంపులు, వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లను సీజ్ చేశామన్నారు. ఇంకా హైదరాబాద్‌లో మరో 5 నకిలీ సర్టిఫికెట్ల ముఠాలు ఉన్నట్లు గుర్తించామని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.