YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అలంపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల దూకుడు

అలంపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల దూకుడు

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 16
అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారసుడికోసం ఆ ఎమ్మెల్యే ప్లాట్‌ఫారం సిద్ధం చేస్తున్నారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో.. అధికారపార్టీకి చెందిన ఇతర నేతలు ఒక్కసారిగా యాక్టివ్‌ అయ్యారు. బరిలో ఉంటామని సంకేతాలిస్తున్నారట. మరికొందరైతే అనుచరులను బరిలో దింపేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో నియోజకవర్గంలో అలజడి మొదలైందట.జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ నియోజకవర్గం టీఆర్ఎస్‌ రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కోసం పాత, కొత్త నాయకులు గట్టి ప్రయత్నాలే మొదలుపెట్టారట. ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గమైన అలంపూర్‌లో పట్టున్న ఇతర సామాజికవర్గాల నాయకులు కూడా తమ అనుయాయులను పోటీలో నిలిపే పనిలో ఉన్నారు. నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుండటంతో స్థానికంగా రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఇక్కడ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా అబ్రహం ఉన్నారు. టికెట్‌ కోసం పార్టీలో పోటీ చూశాక.. అబ్రహం వర్గం గుర్రుగా ఉందట. తమ నేతపై దుష్ప్రచారం చేసి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నట్టు అనుమానిస్తోంది ఎమ్మెల్యే వర్గం.అలంపూర్‌ రిజర్వ్డ్‌ నియోజకవర్గంగా మారిన తర్వాత కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే అయ్యారు అబ్రహం. 2014లో కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరించడంతో టీడీపీ నుంచి పోటీ చేసి .. రెండో ప్లేస్‌లో నిలిచారాయన. 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌ కండువా కప్పుకొని పోటీ చేసి.. భారీ మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం వయసు మీరడంతో వచ్చే ఎన్నికల్లో అబ్రహం బదులు ఆయన కుమారుడు డాక్టర్‌ అజేయ్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అజేయ్‌కు ఆసక్తి ఉంటే.. ఆ మేరకు సిద్ధం చేసుకోవాలని పార్టీ పెద్దలు అబ్రహానికి చెప్పినట్టు టాక్‌. ప్రస్తుతం డాక్టర్ అజేయ్‌ అలంపూర్‌లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారట.ఇదే సమయంలో టీఆర్ఎస్‌లోని ఇతర నాయకులు కూడా టికెట్‌ ఆశించి గేర్‌ మార్చడం చర్చగా మారింది. జడ్పీ మాజీ ఛైర్మన్‌ బండారి భాస్కర్‌ మరో కుంపటి పెట్టారట. ఎమ్మెల్యే అబ్రహంను విభేదిస్తున్న పార్టీ కేడర్‌తో బండారి టచ్‌లో ఉంటున్నారట. మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా ఎమ్మెల్యే అనిపించుకోవాలని చూస్తున్నారట. తెలంగాణ ఉద్యమ పోరాటం.. సీఎం కేసీఆర్‌తో ఉన్న పరిచయాలతో ఈసారి టికెట్‌ ఇస్తారని మందా జగన్నాథం వర్గీయులు ప్రచారం మొదలుపెట్టేశారు. 2014లో జగన్నాథం నాగర్‌కర్నూల్‌ ఎంపీగా.. ఆయన తనయుడు శ్రీనాథ్‌ అలంపూర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత ముఖం చాటేశారనే అభిప్రాయం పార్టీలో ఉందట.అలంపూర్‌లో పట్టున్న ఇతర సామాజికవర్గాల నేతలు.. ఎస్సీలలో తమ అనుయాయులకు టికెట్‌ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. పార్టీ యువజన నాయకుడు కిశోర్‌ను తమ శిబిరంలో చేర్చుకుని గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య దంపతులు తమ స్థాయిలో టికెట్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. ఇదే విధంగా మరికొందరు నాయకులు కూడా తమ అనుచరుల కోసం అధిష్ఠానం పెద్దల దగ్గర లాబీయింగ్‌ చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మార్పు ఆశిస్తుందో లేదో కానీ.. పార్టీ నాయకులు మాత్రం లోకల్‌ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts