తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటుచేయాల్సిందిగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కావేరీ నదీ జలాల విషయంలో కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు ముసాయిదాను సమర్పించింది. మే 4 కల్లా ముసాయిదాను సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.కానీ కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ముసాయిదాను సమర్పించలేకపోయారు. దాంతో నీటి వనరుల శాఖ సెక్రటరీ వ్యక్తిగతంగా ముసాయిదాను అందించాలని లేదంటే కేంద్రం కోర్టును ధిక్కరించినట్లేనని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు కేంద్రం ముసాయిదాను సమర్పించింది. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డును బోర్డు అనాలా? కమిటీ అనాలా? అథారిటీ అనాలా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.చాలా కాలంగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదం నేపథ్యంలో ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరిస్తూ తమిళనాడు కంటే కర్ణాటకకే ఎక్కువ టీఎంసీలు అందాలని ఆదేశించింది. దాంతో తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు విషయమై సుప్రీం కోర్టు స్పందిస్తూ ఇప్పుడు ఇస్తున్నదానికంటే 4 టీఎంసీలు ఎక్కువగా తమిళనాడుకు కావేరీ నీరు కేటాయించాలని.. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదేశించింది. కానీ ఇందుకు కర్ణాటక ఒప్పుకోలేదు. ఇప్పుడు ముసాయిదాను సమర్పించడంతో తమిళనాడులో మేనేజ్‌మెంట్ బోర్డు విషయమై సుప్రీం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.