YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

కేసీఆర్ కు మద్దతుగా....రాష్ట్రాలు

కేసీఆర్ కు మద్దతుగా....రాష్ట్రాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 17,
ప్రధాని మోడీ, బీజేపీపైన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించిన పోరాటానికి జాతీయ స్థాయిలో రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది. జాతీయ రాజకీయాలను టార్గెట్ చేసి, ఢిల్లీ కోటను బద్దలు కొడతా, మోడీ సర్కార్ ను గద్దె దించుతానంటూ కేసీఆర్ ముందుకు రావడంతో పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆయన పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) నేత దేవెగౌడ ఇప్పటికే కేసీఆర్ కు మద్దతు ప్రకటించారు. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కూడా కేసీఆర్ కు మద్దతు తెలిపారు. బుధవారం ఉదయం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఫోన్ చేసి, ముంబై రావాలని, తన ఆతిథ్యం స్వీకరించాలని ఆహ్వానించారు. దీంతో ఈ నెల 20న కేసీఆర్ ముంబై వెళ్లేందుకు ముహూర్తం ఫిక్సయింది.బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఫెడరల్ న్యాయం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతును ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. ఈ సందర్భంగా థాకరే మాట్లాడుతూ.. ‘కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాం’ అన్నారు. ‘మిమ్మల్ని ముంబైకి ఆహ్వానిస్తున్నాను. మీరు మా అతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం’ అని కేసీఆర్ ను ఉద్ధవ్ థాకరే ఆహ్వానించారు.కాగా.. సీఎం కేసీఆర్ దేశంలోని పలు ఎన్డీయేతర పార్టీల నేతలతో చర్చలు జరిపారు. ఎన్డీయే, యూపీయేతర కూటమి ఏర్పాటుపై కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని దేవెగౌడ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. టాఎంసీ, డీఎంకే, శివసేన, జేడీఎస్ అధ్యక్షులతో భేటీ అయ్యేందుకు కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో పర్యటించేందుకు సమాయత్తం అవుతున్నారు.అంతకు ముందు కొద్ది రోజుల క్రితమే తన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో చర్చలు జరిపారు. ఇటీవలే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కు ఫోన్ చేసి జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చలు జరపడం గమనార్హం.

Related Posts