ఏలూరు, ఫిబ్రవరి 18,
పీతల సుజాత.. మాజీ మంత్రి.. రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యే. టీడీపీకి, చంద్రబాబుకు వీరవిధేయురాలు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సుజాత 2004లో తొలిసారి ఆచంట ( అప్పుడు ఎస్సీ రిజర్వ్‌డ్) సీటు నుంచి తొలిసారి వైఎస్ గాలికి ఎదురీది మరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేళ్లలో ఎమ్మెల్యేగా నాటి బలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు ప్రజాపోరాటాల్లో పాల్గొన్నారు. రాజకీయంగా ఆమెకు వ్యక్తిగత అనుభవం లేకపోయినా (సుజాత ఫ్యామిలీకి రాజకీయానుభవం ఉంది) ఎమ్మెల్యేగా తొలి ఐదేళ్లు ఆమె సక్సెస్ అయ్యారు.2009లో నియోజకవర్గాల పునర్విభజనలో జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వ్‌డ్ (గోపాలపురం - చింతలపూడి - కొవ్వూరు) నియోజకవర్గాలు వచ్చినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఆమెకు టిక్కెట్ రాలేదు. టిక్కెట్ ఇవ్వకపోయినా? స్థానిక సమీకరణలతో పాటు మూడు ఎస్సీ సీట్లు పశ్చిమలోని మెట్ట ప్రాంతంలోనే ఉండడం అక్కడ పార్టీని శాసించే బలమైన నాయకుల మాట కాదనలేక చంద్రబాబు ఆమెకు 2009లో సీటు ఇవ్వలేదు. పార్టీ సీటు ఇచ్చి ఉంటే ఆమె 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యేవారు. అయినా ఆమె పార్టీ వీడక ఐదేళ్ల పాటు పార్టీ నాటి సమైక్య రాష్ట్రంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా పార్టీ కోసం కష్టపడ్డారు. చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెంట జిల్లా అంతటా నడిచారు. కలిసొచ్చిన రాష్ట్ర విభజన.. రాష్ట్ర విభజన సుజాతకు బాగా కలిసి వచ్చింది. 2014లో ఆమె కమిట్‌మెంట్ గుర్తించిన చంద్రబాబు చింతలపూడి సీటు ఇచ్చారు. చింతలపూడి టీడీపీ చరిత్రలోనే మాజీ మంత్రి విద్యాధరరావు తర్వాత ఎక్కువ మెజార్టీతో గెలిచిన ఆమెకు చంద్రబాబు తన కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఎంత విచిత్రం అంటే 2009లో సుజాతను కాదని.. బాబు జిల్లాలో మూడు రిజర్వ్‌డ్ సీట్లలో సీట్లు ఇచ్చిన ముగ్గురు నేతలు తానేటి వనిత - కర్రా రాజారావు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక కొవ్వూరులో గెలిచిన టీవీ రామారావు తన నియంతృత్వ చర్యలతో పార్టీని నాశనం చేయడంతో 2014లో ఆయనకు సీటు రాలేదు. అలా బాబు నమ్మిన ముగ్గురు పార్టీని ముంచేస్తే సుజాత కమిట్‌మెంట్‌తో ఉన్నారు. ఇక 2014లో సుజాత మంత్రి అయ్యాక చింతలపూడిని అభివృద్ధిని చేసేందుకు తనవంతుగా కష్టపడ్డారు. అయితే గ్రూపు రాజకీయాల నేపథ్యంలో 2019లో ఆమెకు సీటు రాలేదు. సుజాతకు సీటు రాకపోయినా కూడా ఆమె పార్టీ కోసం పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అసలు ఆమెను పక్కన పెట్టడంతోనే చింతలపూడి సీటు చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా 36 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడింది. సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయితే? జిల్లాలో ఓ మహిళకు టీడీపీ ఎప్పుడూ సీటు ఇస్తోంది. మూడు రిజర్వ్‌డ్ సీట్లలో ఓ మహిళకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం 2004 నుంచి క్రమం తప్పకుండా నడుస్తోంది. 2004లో పీతల సుజాత - 2009లో తానేటి వనిత - 2014లో పీతల సుజాత - 2019లో వంగలపూడి అనిత పోటీ చేశారు. వీరిలో వనిత మినహా మిగిలిన అందరూ గెలిచారు. ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే రెండుసార్లు గెలిచిన సుజాతకు 2024లో సీటు రావడం పక్కా అవుతుంది. పైగా గత ఎన్నికల్లో సుజాతకు వ్యతిరేకంగా పనిచేసిన లాబీయింగ్ కుదేలైపోయి ఎవరికి వారు చిత్తయ్యారు. ఈ సారి చంద్రబాబు లాబీలకు తలొగ్గే పరిస్థితి లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా చింతలపూడిలో ఆమె పోరాటాలు చేస్తూ.. నియోజకవర్గ కేడర్‌కు టచ్‌లోనే ఉంటున్నారు