విజయవాడ, ఫిబ్రవరి 18,
మూడు రాజధానుల అంశం వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహన్ని రూపొందించినట్లు తెలిసింది. ఒక రాజధానితో పాటు రెండు ఉపరాజధానులను ప్రతిపాదించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూనే విశాఖపట్నం, కర్నూలును ఉపరాజధానులుగా ప్రకటించనుంది. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధిచి న్యాయపరమైన అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో మాదిరి న్యాయ వివాదాలు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయినట్లు చెబుతున్నారు. దీంతో ప్రతి అంశాన్ని అన్ని కోణాల నుండి పరిశీలిస్తూ బిల్లును రూపొందించే పనిలో అధికారయంత్రాంగం నిమగమైంది. పరిపాలనా సౌలభ్యం రీత్యా ఉపరాజధానుల్లో అనుబంధ అనుబంధ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే విధంగా బిల్లులో ప్రస్తావించనున్నారు. గతంలో విశాఖలో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తే హెచ్‌ఓడిల నుండి ఖర్చును వసూలు చేస్తామని కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉప రాజధానుల పేరుతో ఈ వ్యవహారాన్ని ముందుకు నడిపించాలని భావిస్తున్నారు. హైకోర్టు విషయంలో మాత్రం కొంత తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది. కేంద్ర న్యాయశాఖ నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ఎలా చేయాలన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. ముందే న్యాయరాజధాని కర్నూలు అని ప్రకటిస్తే విశాఖలో బెంచ్ ఏర్పాటు వ్యవహారం సమస్యగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉప రాజధానులుగా ప్రకటన చేసి ముందుగా కొంత పరిపాలన ఆయా ప్రాంతాల్లో నుండి మొదలుపెడితే ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి కూడా విశాఖ భవిష్యత్‌లో పెద్దనగరంగా మారుతుందని, పరిపాలనకు అన్ని విధాలా అనుకూలమైందని ప్రకటన చేయడం వెనుక కూడా ఇద్దే ఉద్దేశమని తెలిసింది.
ఇటీవల సినిమా నటులతో జరిగిన సమావేశంలోనూ అందరం విశాఖ వెళ్లాల్సిన వారిమే అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం, మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతున్నామని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన విషయాలు తెలిసినవే.గతంలో పెట్టిన బిల్లులో నేరుగా మూడు రాజధానులు అని ప్రస్తావించడంతో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శాసనమండలిలోనూ బిల్లును సెలక్టు కమిటీకి పంపారు. సుమారు 600 మంది అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరారు. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఇటీవల సిఆర్‌డిఏ పేరుమార్పు, మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఉత్తర్వులూ ఇచ్చింది. అదే సమయంలో మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నామని పదేపదే ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.