విశాఖపట్టణం, ఫిబ్రవరి 18,
విఘ్నాలను తొలగించే దేవుడిగా విగ్నేశ్వరుడిని కొలుస్తారు. కాని అలాంటి విఘ్నేశ్వరుడే వివాదంలో చిక్కుకున్నాడు. విశాఖ జలారిపేటలో ఉన్న బెల్లం వినాయకుడి ఆలయ అర్చకులు, స్థానిక మత్స్యకారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆలయం తమదంటే తమద౦టూ ప౦చాయితీకి తెరలేపారు ఇరు వర్గాలు.విశాఖలోని సాగర తీరంలో వెలసిన బెల్లం వినాయక ఆలయానికి ఏడు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. కుళుత్తుంగ చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ భక్తులు స్వామివారికి బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. స్వామివారిని దర్శించుకునే భక్తులు ఏదైనా కోరిక కోరుకుని ఆ కోరిక నెరవేరినట్లయితే బెల్లం ఇస్తామంటూ మొక్కుకుంటారు. అలా వారు కోరిన కోర్కెలు తీరినట్టయితే.. మొక్కుకున్న ప్రకారం అన్ని కేజీల బెల్లం స్వామివారికి సమర్పించుకోవట౦ ఆనవాయీతి. అయితే ఆ ఆలయం చుట్టూ ఇప్పుడు వివాదం అలుముకుంది. బుధవారం స్థానిక మత్స్యకారులు ఆలయ నిర్వహణ బాధ్యలు తమకు అప్పజెప్పాల౦టూ రోడ్డెక్కారు. ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవాలని, లేదా తమకు అప్పగించడం చేయాలని నిరసనకు దిగారు. ఆలయ అర్చకులు అవకతవకులకు పాల్పడుతున్నారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా వారు సమర్పించిన బెల్లాన్ని అమ్ముకుంటున్నారని మత్స్యకారులు ఆరోపించారు. వెంటనే అర్చకులను తొలగించి స్థానిక మత్స్యకారులకు ఆలయాన్ని అప్పగించాలని మత్స్యకార నాయకులు వలిశెట్టి తాతాజీ తదితరులు డిమాండ్ చేశారు. బెల్లం వినాయకుని ఆలయం అందరిదీ, మీ ప్రాంతంలో ఉందని స్వాధీనం చేసుకుంటామంటే, అది చట్ట ఉల్లంఘనే’ అని ఆలయ అర్చకులు శర్మ తెలిపారు. స్థానికులు కొందరు ఆలయం తమ ప్రాంతంలో ఉందని, నిర్వహణ తామే చూసుకుంటామని రెండు వారాలుగా అలజడి సృష్టిస్తున్నారన్నారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద హడావుడి చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. దేవాదాయశాఖ నిబంధనల మేరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఇరు వర్గాల మధ్య వివాదం కాస్తా ముదరడంతో దేవాదాయశాఖ అధికారులు ఎంటరయ్యారు.వివాదంలోకి దేవాదాయశాఖ ఎంట్రీతో పిల్లి పోరు పిల్లి నక్క తీర్చి౦దనట్టు వివాదం తయారయింది. ఇంతవరకు సింగిల్ ట్రస్టీ అధీనంలో ఉన్న ఆలయానికి ఇప్పుడు నూతన౦గా EO ను ఏర్పాటు చేశారు దేవాదాయ శాఖ అధికారులు. ఇరువర్గాల మధ్య వివాదానికి EO నియామకంతో చెక్ పెట్టారు అధికారులు