YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ప్రభుత్వం పన్నులు తగ్గించినా నూనె ధరలు ...

ప్రభుత్వం పన్నులు తగ్గించినా నూనె ధరలు ...

ముంబై, ఫిబ్రవరి 18,
దేశంలో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు మిమ్మల్ని భయపెడుతున్నాయా.. అయితే మరి వంట నూనెల ధరలపైన కూడా ఒకసారి లుక్కేయండి. దేశప్రజలకు పెరిగిన వంట ధరల ఉపశమనం కలిగించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ.. అదే సమయంలో నూనెల ధరలు తగ్గాల్సింది పోగా మరింతగా పెరిగాయి. దీనికి తోడు ప్రభుత్వం నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం వివిధ వంటనూనె దిగుమతులపై విధిస్తున్న పన్నులను 4 సార్లు తగ్గించింది. దీని కారణంగా వాస్తవానికి వంటనూనెల ధరలు కిందకు దిగిరావడానికి బదులుగా మరింతగా పెరిగాయి. దేశంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేసే సగటు కార్మికుడు రోజంతా పనిచేస్తే వచ్చే డబ్బు కనీసం ఒక కిలో నూనె కొనేందుకు కూడా సరిపోని పరిస్థితి నెలకొంది.ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న వంటనూనె అవసరాల్లో 65 శాతం.. దిగుమతుల ద్వారానే తీర్చబడుతున్నాయి.దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల్లో దాదాపు 60 శాతంతో పామాయిల్‌ అగ్రగామిగా ఉంది. ఎందుకంటే భారతదేశం పామాయిల్ వాడకంలో పెద్ద వినియోగదారు.అందుకే భారత్‌లో దానిపై పన్ను తగ్గిన వెంటనే.. పామాయిల్ ఉత్పత్తి చేసే దేశాల్లో ధరలు పెరగడం మొదలవుతుంటుంది.విదేశాల్లోని కంపెనీలు పామాయిల్ ధరలను పెంచడం వల్ల మళ్లీ వంటనూనె ధర ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా భారత ప్రభుత్వం వంటనూనె దిగుమతిపై పన్నులు తగ్గిస్తున్నప్పటికీ.. దాని ప్రతిఫలం ఇక్కడి ప్రజలకు అందడం లేదు. పైగా పన్ను తగ్గింపుతో.. సుంకం రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గుతోంది. పప్పు ధాన్యాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రభుత్వం మసూర్‌ దాల్(ఎర్ర కందిపప్పు) దిగుమతి పన్ను రేటును మార్చింది. దీని వల్ల తగ్గాల్సిన దాని ధర బదులుగా పెరిగింది. మంగళవారం నాడు దిల్లీలో ఎర్ర కందిపప్పు ధర రూ.100 గా ఉంది. దీని ధర గత వారం పన్ను తగ్గింపుకు ముందు రూ.98 గా ఉంది.దేశంలో రబీ, ఖరీఫ్ రెండు పంట సీజన్లలో సైతం పప్పు ధాన్యాలు, నూనె గింజలను సాగు చేస్తున్నప్పటికీ అవి దేశంలోని అవసరాలను తీర్చలేక పోయాయి. దీంతో విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటే ధరలు దిగివస్తాయని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆస్ట్రేలియా, కెనడా ల నుంచి దిగుమతి చేసుకునే పప్పు ధాన్యాలపై.. ఫిబ్రవరి 12న భారత ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. కానీ.. ఈ చర్యలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఎప్పటి వరకు భారత్ తన వంట నూనె అవసరాల కోసం విదేశాలపై ఆదారపడుతుందో.. విదేశాల్లో వంట నూనెల ధరలు దిగిరావో అప్పటి వరకూ వీటి రేట్లు తగ్గే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

Related Posts