YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రంగంలోకి దిగిన ములాయం

రంగంలోకి దిగిన ములాయం

లక్నో, ఫిబ్రవరి 18,
తనయుడి కోసం ఆ తండ్రి తపన అంతాఇంతా కాదు. ఎలాగైనా మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆకాంక్షతో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్వయంగా రంగంలోకి దిగారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వృద్ధ వయసులోనూ ములాయం తనదైన శైలితో దూసుకెళ్తున్నారు. ఉత్తర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తంగా సాగుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ ఎత్తులు పైఎత్తులతో దూసుకుపోతున్నాయి. అటు తనయుడి గెలుపు కోసం ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రంగంలోకి దిగారు. దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న బీజేపీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు ములాయం. ఎస్పీని గెలిపిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్‌ అన్నారు. ప్రచారంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ములాయం. రాష్ట్ర, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రైతులు, యువకులు, వ్యాపారులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమాజ్‌వాది పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని.. అఖిలేశ్ నాయకత్వాన్ని మరింత పటిష్ఠం చేయాలన్నారు. బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు ములాయం. యావత్ దేశ ప్రజల దృష్టి యూపీ ఎన్నికలపైనే ఉందన్నారు.కొంత కాలంగా ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, ఆయన కుమారుడు, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ మధ్య దూరం బాగా పెరిగిందని వార్తలొస్తున్నాయి. ఇటీవల ములాయంసింగ్ చిన్న కోడలు బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆమె ఆయన నుంచి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ములాయం సింగ్‌ యాదవ్‌ దూరంగా ఉంటారని అందరూ భావించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెయిన్‌పురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అఖిలేశ్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. అయితే.. ఐదేళ్ల తర్వాత ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్, శివపాల్ కలిసి ప్రచారం చేయడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Related Posts