నెల్లూరు, ఫిబ్రవరి 19,
నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో ఒంటరి వాడయ్యారనే చెప్పాలి. ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం బాలాజీ జిల్లాలో కలసి పోనుంది. దీనిని ఆనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ ను కలసి నెల్లూరు జిల్లాలోనే రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను ఉంచాలని ఆనం రామనారాయణరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇందుకు ప్రభుత్వం కూడా అంగీకరించదు. ఆనం రామనారాయణరెడ్డి కి కూడా కావాల్సిందదే. ఆనం చెప్పినట్లుగా గతంలో రాపూరు నియోజకవర్గం ఆనం కుటుంబానికి పట్టుఉండేది. అయితే 2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా ఆనం కుటుంబానికి బలమైన రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలు వెంకటగిరి నియోజకవర్గాల్లో కలిపారు. దీనిపై పరోక్షంగా ఆనం విమర్శలు చేశారు. నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి తమ కుటుంబానికి అన్యాయం చేశారని, అందుకు తగిన ఫలితాన్ని ఆయన అనుభవించారని పరోక్షంగా ఆనం రామనారాయణరెడ్డి నేదురుమిల్లి కుటుంబానికి శాపనార్థాలు పెట్టారు.ఇప్పుడు కూడా జిల్లాల విభజనలో తమకు అన్యాయం జరిగిందని ఆనం హైరానా పడుతున్నారు. దీనికి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీతి మాలిన రాజకీయాలు చేయవద్దని ఆనంను రాంకుమార్ రెడ్డి హెచ్చరించారు. తన తండ్రి నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి లేకుంటే ఆనంకు రాజకీయ భవిష్యత్ ఉండేది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. దీనికి తిరిగి ఆనం కౌంటర్ ఇచ్చారు. రాజకీయ అనుభవం లేని వాళ్లు మాట్లాడే మాటలను తాను పెద్దగా పట్టించుకోనని, ఈ విషయాన్ని జగన్ వద్దనే తేల్చుకుంటానని చెప్పారు. అయితే ఆనం అజెండా మాత్రం ఒక్కటే. జిల్లాల విభజనకు తాను వ్యతిరేకం కాదంటూనే జిల్లాల విభజన వల్ల నీటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. అశాస్త్రీయంగా జిల్లాలను విభజిస్తే అధికార పార్టీకి రాజకీయ ఇబ్బందులు తప్పవని ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరిస్తున్నారు. దీని అర్థం తాను జిల్లాల విభజనకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తానని చెప్పకనే చెప్పారు. పార్టీ నుంచి సర్దుకుంటానికి కూడా రెడీ అని అంటున్నారు. వైసీపీ అధిష్టానం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డి చేత ఆనంకు కౌంటర్ ఇప్పించి నీ స్థాయి ఇంతేనని గుర్తు చేసినట్లయింది. మొత్తం మీద ఆనం అజెండా క్రిస్టల్ క్లియర్ గా ఉంది.