YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గ్రామ పంచాయితీ నిధుల కోసం పోరు

గ్రామ పంచాయితీ నిధుల కోసం పోరు

విజయవాడ, ఫిబ్రవరి 19,
టీడీపీ కార్యాలయంలో రెండో రోజు సర్పంచుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సర్పంచ్‌లకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. చెత్త పన్నుకు వ్యతిరేకంగా పంచాయతీల్లో తీర్మానం చేయాలని వారికి హితవు పలికారు. టీడీపీ సర్పంచ్‌లు ఉన్న ప్రతి చోట చెత్త పన్నుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు ఇవ్వకుంటే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలని.. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. వివేకా హత్య కేసు విషయంలో తండ్రి తర్వాత తండ్రి లాంటి బాబాయ్‌ను చంపి టీడీపీ మీద జగన్ విమర్శలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ కేసులో దొంగలను పట్టుకున్న సీబీఐది తప్పంటారా అని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని వైఎస్ వివేకా అన్నందుకు కక్ష కట్టారన్నారు. పరిటాల రవి హంతకులను ఒక్కొక్కర్ని చంపేశారని.. రాష్ట్ర ముఖ్యమంత్రే నేరాలు, ఘోరాలు చేస్తూ హత్య రాజకీయాలు చేస్తే ఎలా అంటూ నిలదీశారు. సర్పంచ్‌లను సీఎం జగన్ ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గ్రామాల్లో సర్పంచ్‌లను కాదని ఒక్క పని చేయడానికైనా వీల్లేదన్నారు. గ్రామాల్లో సర్పంచులే సుప్రీం అన్నారు. టీడీపీ సర్పంచులు పట్టుదలతో వ్యవహరిస్తే వైసీపీ సర్పంచుల నుంచే మద్దతు లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.టీడీపీ హయాంలో కట్టించిన భవనాలకు రంగులేసుకోవడంతోనే వైసీపీ పాలన సరిపోతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రూ. 7 వేల కోట్లకు పైగా నిధులు ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి వచ్చాయన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల ఖాతాలకు చేరాల్సిన నిధులను ప్రభుత్వం తీసేసుకుందని మండిపడ్డారు. గ్రామాల్లో పేదలకిచ్చిన ఇంటి జాగా నివాస యోగ్యంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల సేకరణలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. పేదలకిచ్చిన భూములన్నీ లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాయని.. ఓ పంచాయతీ నుంచి మరో పంచాయతీకి రోడ్లేయలేని సీఎం జగన్.. విమానాలు తెస్తారట అంటూ సెటైర్లు వేశారు. విమానాలు వస్తే రోడ్లతో పనే ఉండదు.. రోడ్ల మీద వ్యవసాయం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టి.. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు.. విపరీతంగా అప్పులు తెచ్చారు.. కానీ జెన్‌కో ఉద్యోగులకు జీతాలివ్వలేకపోయారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఒక్క రోజైనా ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇచ్చామా అని అడిగారు. సీఎం జగన్ హోల్ సేలుగా దోచుకుంటుంటే.. మిగిలిన అధికార పార్టీ నేతలు చిల్లర దొపిడీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుకను హోల్ సేల్‌గా అమ్మేశారని.. గ్రామాలకు రావాల్సిన సెస్ రాకుండా చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts