విజయవాడ, ఫిబ్రవరి 19
కొన్ని ప్రదేశాలకు కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఆ విశిష్టత అంతా ఆ ప్రాంతాలలో ఉన్న ప్రత్యేకతను బట్టి వస్తూ ఉంటుంది. అలా ప్రత్యేకత సంతరించుకుని ఎవ్వరికీ పెద్దగా తెలియని ప్రాంతం పెనుగంచిప్రోలు. కృష్ణా జిల్లాలో ఉన్న జగ్గయ్యపేట నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ పెనుగంచిప్రోలు ఉంది. ప్రతి పేరు వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కొన్ని ప్రాంతాలను ఆ ప్రాంతాలలో గొప్ప వ్యక్తుల పేర్ల, కుటుంబాల ఆధారంగానూ, మరికొన్ని ప్రాంతాలలో పరిస్థితుల కారణంగానో, ఇంకా కొన్ని ప్రాంతాలలో భౌగోళిక పరంగానూ మరికొన్నిటికి ప్రదేశాల్లో ఉన్న ప్రత్యేకత కారణంగానో పేర్లు స్థిరపడి ఉంటాయి. అలాంటిదే ఈ పెనుగంచిప్రోలు కూడా. దీని అసలు పేరు పెదకంచి అని కాలం మారుతూ ఇది పెనుగంచిగా ఆ తరువాత పెనుగంచిప్రోలుగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది.ఈ పెనుగంచిప్రోలు లేదా పెదకంచి లేదా పెదగంచిలో దేవాలయాలు ఎక్కువగా ఉండేవని చరిత్ర చెబుతోంది. తమిళనాడులో కంచి ఉంది. దాని చిన్న కంచి అని పిలుస్తారు. అది చిన్న కంచి అయితే కృష్ణా జిల్లాలో ఉన్నది పెద్ద కంచి అని పేర్కొన్నారు. అంటే ఎంతో గొప్పదైన కంచి కంటే కూడా అద్భుతమైన దేవాలయాల సమాహారం ఈ పెదగంచి అని అర్థం చేసుకోవచ్చు.కృష్ణాజిల్లా పెదగంచి పక్కనే మున్నేరు ప్రవహిస్తూ ఉండేది. ఆ మున్నేటికి వరదలు వచ్చి పెదగంచిని ముంచేసిందని ఆ మున్నేటి ప్రతాపానికి ఎన్నో దేవాలయాలు మునిగిపోయాయని చెబుతారు. ఆ మునిగిపోయినవి క్రమేణా భూమిలోకి చొచ్చుకుపోయాయని ఇప్పటికీ మున్నేరుకు వరద వస్తే ఆ వరద నీటిలో తొంగిచూసినప్పుడు ఇసుక మధ్యలో నుండి ఎన్నో దేవాలయాల స్తంభాలు, ఇతర శిథిలాలు కనిపిస్తూ ఉంటాయి. చరిత్రలో చూస్తే మున్నేటి ఒడ్డున గోల్కొండ నవాబు అయిన కూలీకుతుబ్ షా కు, హిందూ రాజులకు యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో కూలీకుతుబ్ షా గెలిచాడని. ఆ గెలుపు వల్ల ఆలయాలు ధ్వంసం చేసి ఎంతో సంపదను ఎత్తుకుపోయాడని, ఆ ఆలయాల శిథిలాలు క్రమంగా భూగర్భంలో కలిసిపోయి అవే అప్పుడప్పుడూ బయటపడుతుంటాయని చెబుతారు. గంధపు చెట్లు ఎక్కువగా పెరిగే అడవుల్లో ఆ గంధపు చెక్కలను పొయ్యిలో మంట పెట్టడానికి కూడా వాడతారు, అదే అరుదుగా లభించే వాళ్లకు ఆ గంధపు చెట్లు ఎంతో అపురూపం. అలాగే ఈ పెనుగంచిప్రోలు విషయం కూడా ఇంతే అనిపిస్తుంది. స్థానికులకు ఈ ఆలయాల విశిష్టత, వాటి ప్రాధాన్యత తెలియదు అనడానికి ఉదాహరణ అక్కడ ఎంతో గొప్ప ఆలయాల ఆనవాళ్లు ఉన్నాయని తెలిసినా వాటిని పెద్దగా పట్టించుకోరు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు.పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇది రాష్ట్రంలో 11 వ స్థానంలో ఉండి ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. ఇక్కడి అమ్మవారి కల్యాణం, గ్రామ దేవత తిరునాళ్ళు ఎంతో గొప్పగా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ పెనుగంచిప్రోలులో 101 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఎన్నో గొప్ప ఆలయాలు, అరుదైన దేవాలయాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు పెనుగంచిప్రోలుకు వెళ్తే ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నట్టు ఈ పెనుగంచిప్రోలుకు దగ్గరలోనే విజయవాడ దుర్గమ్మ, వేదాద్రి నరసింహస్వామి, శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణువు క్షేత్రం, కొల్లేటికోటలో పెద్దింట్లమ్మ, నెమలి వేణుగోపాలస్వామి, పెదకళ్లెపల్లి నాగేశ్వరాలయం, ఆకిరిపల్లి వ్యాఘ్రనరసింహస్వామి దేవాలయం. ఇలా అన్నీ ఎంతో అద్భుతమైన దేవాలయాలను కూడా చూడచ్చు. హాయిగా దేవాలయాలను చూస్తూ చుట్టిరావచ్చు.