నెల్లూరు, ఫిబ్రవరి 19,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం 24 గంటల్లో తీసుకున్న రెండు నిర్ణయాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయి కూర్చున్నాయి. ఒకటి ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ అయితే.. మరొకటి డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ. అయితే ప్రవీణ్ ప్రకాశ్ బదిలీపై వెలగపూడి సచివాలయంలోని ఉన్నతాధికారులే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లంతా... చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటూ.. చాలా ఖుషీ ఖుషీగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ పట్ల అటు ఉన్నతాధికారుల్లో.. ఇటు ఫ్యాన్ పార్టీ నేతల్లో తీవ్ర గుబులు అయితే రేపుతోందన్నది మాత్రం సుస్పష్టం. చేయని తప్పుకు గౌతమ్‌ను బలి చేశారనే టాక్ అయితే... అమరావతిలో మాత్రం రచ్చ రచ్చ చేసి పెడుతోంది. ఎందుకంటే.. అధికారిక హోదాలో డీజీపీగా గౌతమ్ సవాంగే ఉంటారని... సదరు డీజీపీగా ఆయనకు ప్రభుత్వం అన్నీ సౌకర్యాలు కల్పిస్తోందని... కానీ.. డీజీపీగా తీసుకునే నిర్ణయాలు మాత్రం ఆయన చేతుల్లో ఉండవన్నే సంగతి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసునన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఎవరు నమ్మినా నమ్మక పోయినా ఇది మాత్రం పక్కా వాస్తవమని అమరావతిలోనే కాదు.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సైతం ఇదే చర్చ నడుస్తోంది. మరి అయితే డీజీపీ తీసుకునే నిర్ణయాలు అన్నీ ఎవరి చేతిలో ఉంటాయి.. వాటిని ఎవరు తీసుకుంటారంటే మాత్రం అందరి చూపుడు వేళ్లు మాత్రం ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపిస్తాయని సమాచారం. జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి సకల శాఖల మంత్రిగా ప్రాచుర్యం పొందిన సజ్జల వారే అనధికారిక హోంమంత్రిగా వ్యవహరిస్తారనే టాక్ అయితే రాష్ట్రంలో మస్త్ మస్త్‌గా నడిచింది.. నడుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా సజ్జల వారే ఆదేశాలిస్తారన్న టాక్ కూడా ఖాకీ డిపార్టుమెంట్‌లో ఉండనే ఉంది. రాష్ట్ర హోంమంత్రి ఎం సుచరిత ఎప్పుడైనా ప్రెస్‌మీట్లు పెట్టమని ఫ్యాన్ పార్టీ ఆఫీసు నుంచి ఆదేశాలు వస్తే మాత్రమే వాటిని ఆమె తూ.చ తప్పకుండా పాటిస్తారు. అంతే తప్ప ఆమె సమీక్షలు చేసే పరిస్థితి కూడా లేదని ఆ పార్టీ నేతలే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సాక్షిగా గుసగుసలాడుకుంటారు. అయితే డీజీపీ కార్యాలయంలోని అన్ని వ్యవస్థల్లో సజ్జల వర్గానికి చెందిన వ్యక్తులు కీలకంగా ఉన్నారనే చర్చ కూడా బాహటంగా ఉంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో ఓ సీఐ సివిల్ దుస్తుల్లో అల్లరి మూకలతో కలిసి దాడులు చేస్తూ దొరికిపోయారంటు నాడు మీడియా సాక్షిగా రచ్చ రచ్చ అయిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక రాజకీయ నేతల అరెస్టులను సీఐడీ చేతుల మీదుగా జరిపిస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో రాజకీయ కక్ష సాధింపులన్నీ సీఐడీనే పర్యవేక్షిస్తోందనే అపవాదును సైతం ఈ జగన్ ప్రభుత్వం మూట కట్టుకోంది. అసలు డీజీపీగా ఉన్న సవాంగ్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండానే.. ఈ వ్యవహారాలన్నీ అంతా సైలెంట్‌గా జరిగిపోతుందంటారు పోలీసు శాఖలోని పలువురు ఉన్నతాధికారులు. తాజాగా ఎమ్మెల్సీ పి.అశోక్ బాబును అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు.. అదనపు ఎస్పీని సంప్రదిస్తే తమకు విషయం తెలియదని ఆ విషయాన్ని సీఐడీనే అడగాలని చెప్పడం గమనార్హం. అలా పోలీసు వ్యవస్థలో భాగమైన సీఐడీపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి అసలు అదుపు లేకుండా పోయిందని చెప్పటానికి ఓ ఉదాహరణ మాత్రమే. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ విషయంలో కూడా జగన్ ప్రభుత్వాన్ని డీజీపీ సవాంగ్ నిరాశపర్చలేదు. ఆయన సైలెంట్‌గా ఉండి. .. ఎప్పుడు ఏది మాట్లాడమని చెబితే అది మీడియాకు ఆయన చెబుతూ వచ్చారు.. వస్తున్నారు. ఇలా చెబితే తన పరువు పోతుందని తెలిసినా కూడా అన్నిటికి సిద్దపడి డీజీపీగా గౌతమ్ అదే చేశారు. అదీకాక.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చాలా సార్లు.. డీజీపీగా గౌతమ్ తన ఇమేజ్‌ను సైతం పోగట్టుకున్నారనే టాక్ కూడా పోలీస్ శాఖలో ఉంది. సీఎంగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి ఎంపికగా సవాంగ్‌ను డీజీపీగా నియమించారు. అయితే జగన్ పదవీ బాధ్యతలు చేపట్టక ముందే సవాంగ్ యాక్షన్‌లోకి దిగిపోయారు. అప్పటి నుండి ఆయన పనితీరు విషయంలో ప్రభుత్వం ఎక్కడా అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరగలేదు. చివరకు సోషల్ మీడియా పోస్టుల అరెస్టుల విషయంలో ప్రజల నుంచి విమర్శలు వచ్చినా.. కోర్టుల నుంచి నోటీసులు అందుకున్నా కూడా ప్రభుత్వం మాత్రం డీజీపీ గౌతమ్ పనితీరుపై సంతృప్తికరంగానే ఉందని తెలుస్తోంది. మరి ప్రభుత్వాన్ని జగన్ నడిపిస్తుంటే.. పోలీసు శాఖను మాత్రం సకల శాఖల మంత్రి సజ్జల నడిపిస్తున్నారని.. అలాంటిది.. గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేయడం ఎంత వరకు సబబు అని పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సజ్జల వారి డైరెక్షన్‌లో పోలీసు శాఖ పని చేస్తుంటే.. పనిష్మెంట్ మాత్రం గౌతమ్ సవాంగ్‌కి ఇవ్వడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు.. ఖాకీ డ్రస్‌తో ఉద్యోగం చేసుకునే గౌతమ్ సవాంగ్‌కు.. ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించి.. చివరకు ఆయనకు ఆ డ్రస్‌ను కూడా దూరం చేసిందనే చర్చ అయితే పోలీస్ శాఖలో నడుస్తోంది. డీజీపీగా గౌతమ్‌ను తప్పించడం.. జగన్ ప్రభుత్వంలోని సజ్జల స్క్రిప్ట్‌లో భాగమేననే చర్చ అయితే అమరావతిలో హాట్ హాట్‌గా నడుస్తోంది.