YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉగాది నాటికి కొత్త జిల్లాలు.. కొత్త మంత్రులు

ఉగాది నాటికి కొత్త జిల్లాలు.. కొత్త మంత్రులు

విజయవాడ, ఫిబ్రవరి 19,
ఉగాదికి కొత్త జిల్లాలతో పాటు కొత్తమంత్రులు కొలువుతీరనున్నారన్న ప్రచారంతో ప్రకాశంజిల్లాలో మంత్రి పదవుల కోసం తమ అదృష్టాన్ని పరిక్షించుకునే ఆశావహుల హడావిడి మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో.. ప్రకాశంజిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కందుకూరు, గిద్దలూరు, సంతనూతలపాడు, దర్శి ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి పదవి కోసం దర్శి, గిద్దలూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు వైఎస్‌ జగన్‌ బంధువు, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి బాలినేనితో సఖ్యత లేని కందుకూరు ఎమ్మెల్యే నేరుగా వైఎస్‌ జగన్‌తో నెల్లూరుజిల్లా నేతల ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనేది సీఎం స్వయంగా నిర్ణయిస్తారని అధిష్టానం పెద్దలు ఇప్పటికే తేల్చిచెప్పేశారు… ప్రస్తుతం వైసిపిలో మంత్రి పదవుల పందేరం హాట్‌టాపిక్‌గా మారింది.రాష్ట్రంలో ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఇప్పటికే స్పష్టం చేసిన నేపధ్యంలో.. జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. ఉగాది నుంచే కొత్తజిల్లాల్లో కలెక్టర్లు, ఎస్‌పీలు, ఇతర ఉన్నతాదికారులు కార్యకలాపాలు నిర్వహించనున్నారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు నిర్వహించనున్నారు. కొత్తజిల్లాలతో పాటు మంత్రివర్గ పునర్వస్తీకరణతో కొత్తమంత్రులు కూడా కొలువుతీరనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు అధిష్టానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. తమకు అవకాశం కల్పించాలంటూ ఇప్పటికే జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్బంలో ప్రకాశంజిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ముందు వరుసలో ఉన్నారు.మరోవైపు మంత్రివర్గంలో మార్పులు చేసే సమయంలో ఇప్పుడున్న అందర్నీ తొలగించకపోవచ్చన్న చర్చ కూడా సాగుతోంది. సీనియర్లను అలాగే ఉంచి మిగిలిన వారిని మార్చేందుకు అవకాశం ఉందంటున్నారు. అలా కాకుండా మొత్తం వందశాతం మంత్రుల్ని మార్చే విధంగా నిర్ణయం తీసుకుంటే సీనియర్‌ మంత్రులకు ప్రాంతీయ అభివృద్ది మండళ్ల పేరుతో వ్యవస్థలను ఏర్పాటు చేసి మూడు జిల్లాలకు ఒక అభివృద్ది మండలి ఛైర్మన్‌గా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఏది ఏమైనా కొత్తజిల్లాలు ఏర్పాటైతే తమకు మంత్రి పదవి లభిస్తుందన్న ఆశతో కొంతమంది ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు…అందుకు అనుగుణంగానే ప్రకాశంజిల్లాలో ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని జిల్లాలతో ఏర్పడే రెండు జిల్లాలకు ఇద్దరు మంత్రులకు అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఈ లెక్కనా.. కొత్తగా ఒంగోలు కేంద్రంగా ఏర్పడే ప్రకాశంజిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి లభించనుంది. నూతన ప్రకాశంజిల్లాలో ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, కొండపి నియోజకర్గాలు ఉండనున్నాయి. ఒంగోలు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రివర్గ పునర్వస్తీకరణలో వీరిద్దరు మంత్రి పదవులు కోల్పోతే ఈ రెండు నియోజకవర్గాలను తప్పించి మిగిలిన ఆరు నియోజకవర్గాలనుంచి నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. దర్శి నుంచి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, గిద్దలూరు నుంచి ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, కందుకూరు నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు…ఇదిలావుంటే, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డికి మంత్రి బాలినేనితో కొంత విబేధాలు ఉన్న మాట వాస్తవమే. ఈ కారణం చేత ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదంటున్నారు జిల్లావాసులు. మరోవైపు దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పార్టీలోనే వర్గపోరు తీవ్రంగా ఉంది. దీంతో వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రత్యర్థులు తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. ఇక, మిగిలిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు దళిత కోటాలో మంత్రి పదవి ఇవ్వాలంటే ఇటీవల ఆయనపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు అడ్డంకిగా మారాయంటున్నారు. మరి అందరూ అనర్హులైతే ఇక మిగిలింది ఎవరయ్యా అంటే మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి. . ఈయన ఫ్రెషర్‌ కావడంతో పాటు తండ్రి మార్కాపురం నుంచి గతంలో ఎమ్మెల్యేగా, సీనియర్‌ పొలిటిషియన్‌గా ఉన్నారు. పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చిన చందంలా అందర్నీ పక్కన పెడితే మార్కాపురం ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం దక్కే అవకాశాలు లేకపోలేదు. సీఎం జగన్‌ తీసుకునే నిర్ణయాలు కూడా అనూహ్యంగా ఉంటున్న నేపధ్యంలో ఈ విధంగా కూడా జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ప్రకాశంజిల్లా నుంచి విడిపోయి బాపట్ల జిల్లాలో కలవనున్న మూడు నియోజకవర్గాలు చీరాల, అద్దంకి, పర్చూరు.. వీటిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ప్రకటించారు. అయితే ఆయన టెక్నికల్‌ కారణాలతో వైసీపీలో చేరకపోయినా ఆయనకు సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రి పదవి ఇచ్చి సముచితంగా గౌరవిస్తారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగిన కరణం బలరాంకు టీడీపీ హయాంలో చంద్రబాబు అన్యాయం చేశారన్న విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు, వైఎస్‌ఆర్‌కు సమకాలీకుడిగా ఉన్న కరణం బలరాం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా మంత్రి పదవి చేపట్టేఅవకాశం రాలేదు.చంద్రబాబు కూడా కరణంను మంత్రి పదవికి దూరంగా ఉంచారన్న ఆరోపణలు ఉన్నాయి… ఈ నేపధ్యంలో సియం వైఎస్‌ జగన్‌ బాపట్లజిల్లా పరిధిలోకి వచ్చే చీరాల నుంచి ఎమ్మెల్యే కరణం బలరాంకు మంత్రి పదవి ఇచ్చి ఆయన జీవితకాల కలను నెరవేర్చే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదే జరిగితే ప్రకాశంజిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి పట్టున్న ప్రాంతాల్లో వైసిపికి సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి… మరి ఇవన్నీ ఒక కొలిక్కి రావాలంటే వచ్చే ఉగాది వరకు ఆగాల్సిందే..

Related Posts