మహబూబ్ నగర్, ఫిబ్రవరి 19,
ఐదో శక్తి పీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ చైర్మన్ పదవి కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పదవి ఎవరికి దక్కుతోందని నియోజకవర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఆలయం. ఈ నెల 4వ తేదీన ధర్మకర్తల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా మండలాలకు చెందిన నాయకులు వారి వారి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఎలాగైనా పదవిని దక్కించుకోవాలని కొందరు నాయకులు డబ్బులు వెచ్చించడానికైనా వెనకడుగు వేయడం లేదని సర్వత్రా చర్చ జరుగుతోంది.ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు మరచి.. ఆలయంలో అక్రమాలు, అవినీతి జరుగుతోందని గతంలో పనిచేసిన ఆలయ చైర్మన్ ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో మధ్య సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారని చర్చ. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయ అభివృద్ధి కోసం పని చేసే వారికి పదవి ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆలయ చైర్మన్ పదవికి రూ.లక్షలు వెచ్చించడానికైనా నాయకులు సిద్ధంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇటిక్యాల మండలానికి చెందిన ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి చైర్మన్ పదవికి రూ. లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలంపూర్ కి చెందిన ఓ నాయకుడు, ఉండవెల్లి మండలం తక్కశిల గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి పదవి దక్కించుకోవాలని ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా వడ్డేపల్లి , అయిజ మండలాలకు చెందిన నాయకులు ఆలయ చైర్మన్ పదవికి వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. చివరికి చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనని ప్రజల్లో చర్చ మొదలైంది.