హైదరాబాద్, ఫిబ్రవరి 19,
చెరాయి, చెవిలోని జోరీగ..
కంటిలోని నలుసు, కాలిముల్లు..
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా..
విశ్వదాభి రామ వినురవేమ.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు ఈ పద్యానికి ఏమైనా సంబంధం వుందా? అంటే ఉందనే అంటున్నారు ఆయన సన్నిహితులు. ముఖ్యంగా మూడో పాదం (ఇంటిలోని పోరు ఇంతింత కాదయా) ముఖ్యమత్రి ప్రస్తుత స్థితికి అద్దం పడుతోందని చెబుతున్నారు. అయితే, ఇది ఇప్పుడు మొదలైంది కాదు, చాలా కాలంగా మీడియాలో కథలు కథలుగా వినవస్తూనే వుంది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే, కేసీఆర్’కు ఫామిలీ ట్రబుల్స్ స్టార్ట్ అయ్యాయనే వార్తలు వచ్చాయి. అంతే కాదు, కేటీఆర్’ అర్జెంట్’ గా కుర్చీ ఎక్కిచాలనే ఇంటి పోరు పడలేకనే ముందస్తుకు వెళ్ళారని, అప్పట్లోనే గట్టి ప్రచారం జరిగింది. అలాగే, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా... కేసీఆర్, సుమారు రెండు నెలలకు పైగా పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. 2018 డిసెంబర్ 13 న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత హోమ్ మంత్రి మహమూద్ అలీ, ఇద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 19 మంత్రి వర్గాన్ని, అది కూడా పాక్షికంగా విస్తరించారు. పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటులో, జాప్యానికి కూడా ఇంటి పోరే కారణమని అప్పట్లోనే వార్తలొచ్చాయి. చివరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం విషయంలోనూ అనూహ్యంగా, విపరీత జాప్యం జరిగింది. అలాగే,తొలి విస్తరణలో ముఖ్యమంత్రి కేసీఆర్, అంతకు ముందు మంత్రి వర్గంలో కీలక శాఖలు నిర్వహించిన కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావుకు స్థానం కలిపించలేదు. అప్పట్లో ప్రహసనంగా సాగిన రాజకీయం వెనక ఉన్నది, ‘ఇంటిపోరే’ అంటారు. అదే విషయాన్ని, తెరాస వెలుపల ఉన్న కల్వకుంట్ల కుటుంబ సభ్యులే మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు. అదే విధంగా, కేటీఆర్ పట్టాభిషేకం గురించి అనేక మార్లు కథలు కథనాలు వచ్చాయి. మీడియాలో చర్చలు జరిగాయి. ముహూర్తాలు కూడ మీడియానే ఫిక్స్ చేసింది. ఒకానొక సందర్భంలో, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కేటీఆర్’ను, అయన సమక్షంలోనే, ‘కాబోయే ముఖ్యమంత్రి’అని సంబోదించారు. అలాగే, ‘అవును, అయితే తప్పేంట’ ని తెరాస నాయకులు మంత్రులు కూడా వంత పాడారు. నిజానికి, కేటీఆర్ కాకపోతే ఇంకో ‘ఆర్’ ముఖ్యమంత్రి అవుతారు అది పెద్ద విషయం కాదు. కుటుంబ పార్టీలలో, ‘కొడుకులే’ పార్టీ అధ్యక్షులు, ముఖ్యంత్రులు అవుతారు తప్ప బయటి వారు కారు, చివరకు కూతుర్లకు కూడా ఆ అవకాశం ఉండదు. సరే ఈ విషయంలోనూ, కేసీఆర్, కవిత మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే ఆమె రాఖీ, బతుకమ్మ పడగలకు ఇతర కుటుంబ వేడుకలకు దూరంగా ఉన్నారనే, ప్రచారం జరిగింది.
అదలాఉంటే, అంతవరకు కేటీఆర్ పట్టాభిషేకానికి కొంత అడ్డుగా ఉన్న, ఈటల రాజేదంర్ ‘ను బయటకు పంపిన తర్వాత, కేసీఆర్ మీద ఫ్యామిలీ ప్రెజర్ పెరిగిందని అంటారు. ఈ నేపధ్యంలోనే, కేసీఆర్ గత నాలుగైదు నెలలుగా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా, ఇతర విషయాలు, విమర్శలతో పాటుగా, అంతకంటే జోరుగా, ఢిల్లీ ముచ్చట చేస్తున్నారు. ఢిల్లీ పోతా, యుద్ధం చేస్తా, అంటూ ప్రకటిస్తున్నారు. జగిత్యాల సభలోనూ ఢిల్లీ కోటను బద్దలు కొడతా, ప్రజలు మద్దతిస్తే జాతీయ రాజకీయాల్లోకి వస్తా, అంటూ బంతిని ప్రజల కోర్టులోకి నెట్టారు. అంతకు ముందు బడ్జెట్ ప్రెస్ మీట్’లోనూ ఇలాగే, ఢిల్లీ గర్జన చేశారు. పార్లమెంట్’కు పోటీ చేస్తాననే మాట కూడా అయన నోటి నుంచి వచ్చింది. నిజమే కావచ్చును, గతంలోనూ ఆయన ఇలాంటి ప్రకటనలు చాలా చేసి ఉండవచ్చును, కానీ, ఈ సారి, కొడుకు కోసం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీకి మకాం మార్చడం ఖాయమని అంటున్నారు. మోడీతో యుద్ధం, ఢిల్లీ కోటలు బద్దలు కొట్టడం తర్వాతి వవిషయం, ముందు ప్రగతి భవన్ ఉక్కపోత నుంచి బయట పడేందుకు, జాతీయ జెండా ఎగరేయడమే మార్గమని అందుకే ఆయన పదే పదే ఢిల్లీ ముచ్చట తీస్తున్నారని రాజకీయ వర్గల సమాచారం అంటున్నారు. ఆయితే అవునా .. కాదా ..అనేది మాత్రం ఒకక్ కేసీఆర్ కే తెలుసు.