కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మీడియాకు తెలిపారు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశామని... జైట్లీతో కిడ్నీ ఇచ్చిన దాత ఆరోగ్యం మెరుగ్గానే ఉందని... వారిద్దరు త్వరగానే కోలుకుంటున్నారని చెప్పారు. అరుణ్ జైట్లీకి ఆపరేషన్ చేసిన వైద్యుల బృందంలో అపోలో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా ఉన్నారు. ఈయన ఎయిమ్స్ డైరెక్టర్ రత్నదీప్ గులేరియాకు సోదరుడు. ఎయిమ్స్ డైరెక్టర్ రత్నదీప్ జైట్లీ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో... ఆయన సోదరుడు సందీప్ గులేరియా జైట్లీకి చికిత్స చేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఏప్రిల్‌లోనే ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. కాని జైట్లీ డయోబెటిస్ సమస్యతో పాటు మరికొన్ని ఇబ్బందులు రావడంతో నిర్ణయం మార్చుకొన్నారు. ఆయన శనివారం ఎయిమ్స్‌లో చేరగా... ఉదయం 8 గంటలకు ఆపరేషన్ మొదలు పెట్టారు. ఏప్రిల్ 6న జైట్లీ ఓ ట్వీట్ చేశారు. అందులో తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు... త్వరలోనే ట్రీట్మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.