కడప, ఫిబ్రవరి 21,
కడప జిల్లా జమ్మలమడుగులో అక్రమ మైనింగ్ యధేచ్చగా జరుగుతోంది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఒప్పందం కుదిరిందట. దానిని ప్రశ్నించేవారే లేకపోవడంతో వాళ్లదే రాజ్యం. మధ్యలో ప్రభుత్వానికి చెందాల్సిన రాయల్టీని ఎగ్గొట్టేస్తున్నారు.జమ్మలమడుగుతోపాటు.. కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల నియోజకవర్గాల్లో భూగర్భమంతా రాతిమయం కావడంతో గాలేరు-నగరి ప్రధాన కాలువ తవ్వినప్పుడు పెద్ద పెద్ద బండరాల్లు బయటపడ్డాయి. గుట్టలు గుట్టలుగా పోగుపడ్డ ఆ బండరాళ్లను సొమ్ము చేసుకున్నారు ఒక నాయకుడు. గత ప్రభుత్వ హయాంలో అప్పట్లో జిల్లాకు చెందిన మంత్రి కంకర మిషన్ ఏర్పాటు చేసుకుని బండరాళ్లను కంకరగా మార్చుకుని అమ్మేసుకున్నారు. మారు మూల ప్రాంతం కావడంతో కరెంటు పెద్దగా ఉండదు. దాంతో మిషన్లకు జనరేటర్లను పెట్టుకుని కంకర క్రష్ చేసి సొమ్ము చేసుకున్నారు.అప్పట్లో ఆ మాజీ మంత్రి పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ గాలేరు-నగరి కాలువ పొడవునా తవ్వకంలో పోగుపడ్డ బండరాళ్లు క్రషింగ్ చేసేశారు. ప్రభుత్వ రికార్డుల్లో చూపించేందుకు మైలవరం మండలంలోని ఓ గ్రామ పరిధిలో కొంత కొండను మైనింగ్‌కు లీజుకు తీసుకున్నారట. ఆ విధంగా లెక్క సరిచేసినట్టు చెబుతారు. ఈలోగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. ఆ మాజీ మంత్రి ఓడి.. అధికారానికి దూరం అయ్యారు. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆ మాజీ మంత్రి ఆటలు సాగనివ్వలేదు. దీంతో ఆ మాజీ మంత్రి క్రషర్ మూతపడింది. ఈ బ్యాక్‌డ్రాప్‌లో కొన్నాళ్లు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు చేసుకున్నారు. కానీ.. కంకర కాసులు వారిని కలిపేశాయి.లక్షలు పోసి కొన్న మిషనరీ ఖాళీగా ఉండటంతో ఎమ్మెల్యేకి మాజీ మంత్రి ఓ ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన నచ్చడంతో ఏడాది క్రితం ఒప్పందం జరిగిందట. అంతే తిట్టిపోసుకున్నవాళ్లు కాస్తా చేతులు కలిపారు. మాజీ మంత్రికి చెందిన క్రషర్ ఎమ్మెల్యే లీజుకు తీసుకునేందుకు అడ్వాన్స్‌గా 50 లక్షలు, నెలకు అద్దె 12 లక్షలుగా సెట్ చేసుకున్నారట. దీనిపై ప్రతిపక్షం మాట్లాడకూడదనే షరతు పెట్టుకున్నారట. డీల్ ఓకే కావడంతో క్రషర్ ఎమ్మెల్యే చేతికి వెళ్లింది. అక్రమ తవ్వకాలతో మైలవరం మండలంలోని GNSS కాలువ రాళ్లు కరిగిపోతున్నాయి. గతంలో మాజీ మంత్రి చేసిన దానికంటే వేగంగా క్రషర్ ట్వంటీ ఫోర్ సెవన్ పనిచేస్తోందట. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏంటంటే.. శత్రువులుగా చూసుకున్న నాయకుల నోళ్లకు తాళాలు పడ్డాయి.. ప్రభుత్వానికి చేరాల్సిన రాయల్టీ ఎగ్గొట్టేశారు.