YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాలయ్య ఎంట్రీతో పార్థసారథి సైలెంట్‌

బాలయ్య ఎంట్రీతో పార్థసారథి సైలెంట్‌

అనంతపురం, ఫిబ్రవరి 21,
అనంతలో జిల్లాల విభజనపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుపై హిందూపురంలో పెద్దఉద్యమమే జరుగుతోంది. జిల్లాలో అనంతపురం తర్వాత పెద్ద పట్టణమైన హిందూపురాన్ని కాకుండా మరో ప్రాంతాన్ని జిల్లా కేంద్రం ఎలా చేస్తారని ఉద్యమిస్తున్నారు. ఈ పోరాటంలోకి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడంతో రెండురోజులపాటు జిల్లాలో రచ్చ రచ్చ అయింది. వాస్తవంగా జిల్లాల విభజన ప్రతిపాదన వచ్చాక ముందుగా వినిపించిన పేరు పెనుకొండ. అన్ని ప్రాంతాలకు సమానమైన దూరం, గొల్లపల్లి రిజర్వాయర్, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండటం.. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పట్టణం కావడంతో ఇక్కడే జిల్లా కేంద్రం ప్రకటించాలని ఉద్యమం జరిగింది. కరోనా కారణంగా కాస్త సైడ్‌ అయినా.. మున్సిపల్‌ ఎన్నికల్లో పెనుకొండ అంశమే ప్రధాన ప్రచారాస్త్రమైంది.పెనుకొండ మంత్రి శంకర్‌నారాయణ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ జిల్లా కేంద్రాన్ని తీసుకొస్తామని ఆయన హామీలు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పార్థసారధి కూడా ఇదే అంశాన్ని చాలాసార్లు డిమాండ్ చేశారు. ఇదే హామీతో మంత్రి శంకర్‌నారాయణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీని గెలిపించారు కూడా. అయితే జిల్లా కేంద్రం పెనుకొండ కాకుండా పుట్టపర్తికి వెళ్లింది. ఈ అంశంపై హిందూపురంలో పెద్ద ఉద్యమమే జరుగుతుంటే.. నిన్న మొన్నటి వరకు పెనుకొండ కోసం పట్టుబట్టిన వాళ్లు మాత్రం నోరు మెదపడం లేదు. ఏడాది క్రితం పెనుకొండ జిల్లా సాధన సమితి కూడా ఏర్పటైంది. జిల్లా కేంద్రం తమ ఆకాంక్ష అని..చివరి వరకు పోరాటం చేసినా సాధ్యం కాలేదని మంత్రి చేతులు ఎత్తేశారు. తనవల్ల కానిది అవుతుందని చెప్పడం కంటే హ్యాండ్సప్‌ బెటర్‌ అనుకున్నట్టున్నారు మంత్రి.అయితే జనం నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న మంత్రి శంకర నారాయణే ఇలా స్పందిస్తుంటే.. ఈ విషయంలో అధికారపార్టీని కార్నర్‌ చేయాల్సిన మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అస్సలు నోరు విప్పడం లేదు. ఆయన కొన్నేళ్లుగా పెనుకొండ నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రంపై సైలెంట్‌ అయ్యారు. దానికీ బలమైన కారణం లేకపోలేదు. పార్థసారథి ప్రస్తుతం టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఓపక్క హిందూపురం కోసం బాలయ్య రంగంలోకి దిగడంతో పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని అడిగితే మొదటికే మోసం వస్తుంది. అంతేకాదు పుట్టపర్తి, కదిరి, మడకశిక ప్రాంత వాసులు దానిని తీవ్రంగా తప్పుపట్టి, వ్యతిరేకించే అవకాశం ఉండటంతో ఆయన మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది.మొత్తంమీద ఎవరూ ఊహించని సమయంలో జిల్లా విభజన తీసుకొచ్చి.. టీడీపీని ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి సీఎం జగన్‌ పడేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. పైకి నవ్వుతూ కనిపించినా.. నాలుగు గోడల మధ్య తమ రాజకీయ భవిష్యత్‌ను తలచుకుని టెన్షన్‌ పడుతున్నారట. మరి.. ఈ సమస్య నుంచి పెనుకొండ నేతలు ఎలా బయటపడతారో చూడాలి.

Related Posts