విజయవాడ, ఫిబ్రవరి 21,
తెలుగు దేశం పార్టీ కంచుకోటలో వైసీపీజెండా ఎగిరింది. ఫ్యాను సుడిగాలిలో సైకిల్ పత్తా లేకుండాపోయింది. అధిపత్య పోరు, నాయకత్వ లోపంతో వర్గపోరు, గ్రూపు తగాదాలతో ప్రత్యర్థి పార్టీ గెలుపునకు దోహదం చేశాయి. జరిగిన నష్టాన్ని తెలుసుకొని అధిష్టానం కొత్త నేతను తెరపైకి తెచ్చి ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. వర్గపోరు ఆ నేతకు తప్పడం లేదా.. సవాళ్ళు మధ్య పసుపు జెండా ఎగురుతుందా.. అన్న నందమూరి తారక రామారావు సొంత జిల్లాలో మళ్లీ పార్టీ మనుగడ సాగిస్తుందా అనేది సగటు రాజకీయవేత్తను వేధిస్తున్న ప్రశ్న.కృష్ణా జిల్లా తెలుగు దేశంపార్టీకి బలమైన ఓటు బ్యాంకుతో కంచుకోటగా ఉన్న జిల్లా.. అలాంటి జిల్లాలో నేతల వర్గపోరుతో పార్టీ కార్యకర్తలు చతికిలాపడ్డారు.. స్వయం కృతాపరాధంతో గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది.. జిల్లాలో తెలుగుదేశంకు ఎన్నుదన్నుగా నిలిచిన నియోజకవర్గం తిరువూరు.. ఆ నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేగా రక్షణ నిధి గెలుపొందారు.. బలమైన ఓటు బ్యాంకు ఉన్నా.. నేతల వర్గపోరు,సరైన ప్రణాలిక లేకపోవడం.. ప్రత్యర్థి పార్టీకి కలిసి వచ్చాయి.తిరువూరు టీడీపీ ఎమ్మెల్యేగా నల్లగట్ల స్వామిదాసు రెండుసార్లు గెలుపొందారు.. అతని భార్య నల్లగట్ల సుధారాణి కృష్ణా జెడ్పీ చైర్ పర్సన్ గా కూడా పని చేశారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ ఇచ్చినా స్వామిదాసుకు అదృష్టం కలసి రాలేదు. మూడు సార్లు ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నా.. కొన్ని వర్గాల సహకారం లేకపోవడం.. నేతల గ్రూపు తగాదాలతో ఓటమి పాలయ్యారని చర్చ జరుగుతోంది.. స్వామిదాసు వ్యవహార శైలి ,యాక్టివ్ గా ఉండకపోవడం.. సీనియర్ నేతలను కలుపుకుని పోకపోవడం వంటి కారణాలు.. ఓటమికి దారి తీశాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి..మూడుసార్లు హ్యాట్రిక్ ఓటమితో.. స్వామిదాసును పక్కన పెట్టింది తెలుగు దేశం పార్టీ అధిష్టానం. 2019 ఎన్నికల్లో మాజీమంత్రి జవహర్‌కు కొవ్వూరు నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా.. ఆఖరి నిమిషంలో.. హడావుడిగా జవహర్‌ను తిరువూరు నియోజకవర్గంలో పోటీ చేయించింది. ఈ ప్రయోగం కూడా.. సక్సస్ కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్నా.. చివరి వరకు అభ్యర్థి ఎవరో టీడీపీ ప్రకటించలేకపోయింది. జవహర్‌కు కొవ్వూరు నుంచి.. తిరువూరుకు మార్చడం.. ప్రచారం.. ప్రణాలిక రూపొందించడంలో సమయం సరిపోలేదని.. ఓటమికి కారణం అయ్యిందని అతని అనుచరులు అంటున్నారు. మరోవైపు నాన్ లోకల్ అయిన జవహార్‌కు స్వామిదాసు వర్గం సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి.ఇదిలావుంటే, తాజాగా స్వామిదాసు, జవహర్‌ను పక్కన పెట్టి.. అనూహ్యంగా కొత్త నేత దేవదత్‌ను తెరపైకి తెచ్చింది టీడీపీ అధిష్టానం. అతన్ని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. అన్ని వర్గాలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు దేవదత్. పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, మాజీమంత్రి దేవినేని ఉమ, జిల్లా నేతలు ఇటీవల నియోజకవర్గ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది ఈ ర్యాలీకి రావడంతో.. టీడీపీకి నూతన ఉత్తేజం వచ్చినట్లు ఉందని.. ఆ పార్టీ నేతలు సంబర పడుతున్నారు. కొత్త నేతకు స్వామిదాసు, జవహర్ వర్గం తో వర్గపోరు ఉన్న నేపథ్యంలో.. వీటిని ఎదుర్కొని.. నిలబడతారా.. నేతలు విభేదాలు వీడి.. కలిసి కట్టుగా పనిచేస్తే.. తిరువూరులో పసుపు జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. మరి ఈ సారైనా.. జెండా ఎగురుతుందా చూడాలి