హైదరాబాద్, ఫిబ్రవరి 21,
సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మళ్ళీ మరోసారి, కాంగ్రెస్ అధిష్టానంపై రాజీనామా అస్త్రాన్ని సంధించారు. గతంలోనూ ఆయన ఇదే విధంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డారు. నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్’గా వచ్చినప్పటి నుంచి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జగ్గారెడ్డి ఇంకొందరు సీనియర్ నాయకులు ఏదో విధంగా రేవంత్ రెడ్డిని బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డిని బద్నాం చేసేందుకు సీనియర్ నాయకులు ఎవరి పంథాలో వారు పావులు కదుపుతున్నారు. నిజానికి, జగ్గా రెడ్డి ఎప్పుడోనే, తాను రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా గుర్తించడం లేదని ప్రకటించారు. అఫ్కోర్స్, ఆ మాటను అలా కాకుండా, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీలను మాత్రమే తాను నాయకులుగా గుర్తిస్తానని చెప్పారు. అంటే, రేవంత్ రెడ్డిని తాను తన నాయకుడిగా గుర్తించడం లేదని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో, సోనియా గాంధీకి రాసిన లేఖ ‘లీక్’ వ్యహారం, క్రమశిక్షణా సంఘం వరకు వెళ్ళింది. అయినా, ఆ వివాదం చివరకు టీకప్పులో తుపానులా ముగిసి పోయింది. అయితే, రెండు మూడు రోజుల క్రితమే, కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సంధి కుదిరిన నేపధ్యంలో జగ్గా రెడ్డి, మళ్ళీ ఇప్పుడు ఈ వివాదాన్ని తెరమీదకు తేవడం చర్చనీయాంసంగా మారింది. అంతే కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన పాత్రధారి జగ్గారెడ్డి ఒక్కరే అయినా సూత్రదారులు వేరే ఉన్నారని పార్టీలోనే చర్చజరుగుతోంది. నిజానికి, ఇదేమీ రహస్యం కాదు. అయితే, ఇలాంటి ఎపిసోడ్స్’ మళ్ళీ మళ్ళీ జరిగితే, అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి మరింతగా బజారున పడుతుందని అంటున్నారు . ముఖ్యంగా, జగ్గారెడ్డి తాజా ఎపిసోడ్’లో రక్తి కట్టించిన వేడుకోలు సీన్’ పార్టీ ఇమేజ్’ని మరింత డ్యామేజి చేస్తుందని అంటున్నారు. కాంగ్రెస్‌ను వీడొద్దంటూ పీసీసీ ప్రాధాన కార్యదర్శి, బొల్లు కిషన్ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకున్న దృశ్యాలు, ‘స్టేజి మేనేజ్’ దృశ్యాలే అయినా, పార్టీ ఇమేజ్’ని దెబ్బ తీసెవే అని వేరే చెప్పనక్కరలేదు. అదలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, బహిరంగంగా ప్రకటించిన జగ్గారెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో వాడిన పదాలు, పార్టీ నుంఛి తనంతట తానూ బయటకు పోవడం కాకుండా,పార్టీనే వేటు వేసి బయటకు పంపాలని కోరుకుంటున్నట్లుగా ఉందని, అయినా పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకపోతే అది పార్టీ బలహీనతకు అద్దం పడుతుందని పార్టీ నాయకులే అంటున్నారు. నిజానికి జగ్గారెడ్డి కోరుకుంటున్నది కూడా అదే.. అందుకే, ఆయన సొనియా గాంధీకి రాసిన లేఖలో ఇక నుంచి తాను కాంగ్రెస్ ‘గుంపు’లో లేనని పేర్కొన్నారు. అంటే, తాను కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీలా కాకుండా ‘గుంపు’ లా చూస్తున్నానని చెప్పకనే చెప్పారు. అంతే కాదు, ఈ అంతటికీ రేవంత్ రెడ్డి కారణమని పరోక్షంగా చెప్పేందుకు ప్రత్యక్ష ఆరోపణలు చేశారు. సొంత పార్టీలోనే కుట్ర చేసి కోవర్టుగా ముద్రవేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో హుందాతనం లేదన్నారు. అంతే కాదు, రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి పీసీసీ చీఫ్ సొంతం చేసుకున్నారని తెరాస చేస్తున్న ఆరోపణలకు ఊతం ఇచ్చేలా లాబీయింగ్ ద్వారా కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ అవ్వొచ్చని విమర్శించారు. అయితే, పార్టీని వీడినా గాంధీ కుటుంబానికి విధేయంగా ఉంటానని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే జగ్గారెడ్డి, ఏదో ఆషామాషిగా ఈ తాజా వివాదానికి తెర తీయలేదని, పకడ్బందీ వ్యూహంతోనే రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్’గానే ఈ ఆరోపణలు చేశారని అంటున్నారు. అయితే, ఫైర్ బ్రాండ్ లీడర్’ గా పేరొందిన రేవంత్ రెడ్డి, అదేమిటో కానీ , కుటుంబ కలహాలు అంటూ కూల్’గా రియాక్ట్ అయ్యారు.గతంలో లానే, ఈ వివాదం కూడా కూడా టీ కప్పులో తుపాన్’ చల్లారి పోతుందని అన్నారు. అయితే, చల్లారిపోయేది వివాదమా లేక దిగజారిపోయేది పార్టీ ఇమేజా అనేదే ఇప్పుడు కాంగెస్ ముందున్న ప్రశ్న.అంటున్నారు, కాంగ్రెస్ పార్టీనాయకులు.