YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంగళవారం సీఎం జగన్ తో భేటీ ఇంతలోనే పెనువిషాదం

మంగళవారం సీఎం జగన్ తో భేటీ ఇంతలోనే పెనువిషాదం

హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా.. పరిశ్రమల శాఖ మంత్రి అయిన మేకపాటి వారం రోజులపాటు దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఏపీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి జగన్ ప్రభుత్వం దుబాయ్ ఎక్స్పో వేదికగా పలు కంపెనీలతో పరిశ్రమల శాఖ ఎంవోయూలు చేసుకుంది. వారం రోజులపాటు పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం నాడు గౌతమ్ హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ కీలక భేటీలో దుబాయ్ పర్యటనకు సంబంధించి వివరాలన్నీ సీఎంకు వివరించాలని మేకపాటి అనుకున్నారు. భేటీ తర్వాత అమరావతిలోనే మేకపాటి ప్రెస్మీట్ కూడా నిర్వహించాలని భావించారు.. అయితే ఇంతలోనే పెనువిషాదం చోటుచేసుకుంది. దుబాయ్ పర్యటన ద్వారా ఏపీకి రూ. 5,015 కోట్ల పెట్టుబడులను గౌతమ్ తీసుకొచ్చారని తెలుస్తోంది.
సోమవారం ఉదయం గుండెనొప్పిగా ఉందంటూ గౌతమ్ తన భార్యకు చెప్పారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు గౌతమ్ను అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించింది. ఆయన ప్రాణాలు నిలపడానికి డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణానికి పోస్ట్ కొవిడ్ పరిణామాలే కారణమని తెలుస్తోంది. మేకపాటి మరణించారని తెలుసుకున్న ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Related Posts