నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈయన అకాల మరణానికి రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు సౌమ్యుడు స్నేహశీలి అయిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణానికి గురికావడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం మంచి రాజకీయ నేతను కోల్పోయామని బాధను వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమల స్థాపనకు తన సహకారం అందించాలనే సంకల్పముతో, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు , సలహాలు, ఆదేశాల మేరకు దుబాయ్ పర్యటనకు వెళ్లిన మేకపాటి గౌతం రెడ్డి ఆదివారం హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం సుమారు తొమ్మిది మంది సమయంలో అకాల మరణం చెందారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తంగా ప్రజలందరికీ దావానలంలా వ్యాపించింది. విషయం తెలిసిన వెంటనే వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు ప్రతిపక్ష నేతలు సైతం అపోలో హాస్పిటల్ కు చేరుకొని గౌతమ్ రెడ్డి మరణానికి బాధాతప్త లైనారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ లోని మేకపాటి నివాసంలోకి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని తీసుకు రావడంతో ఆ ప్రాంతంలో మంత్రి గౌతమ్ రెడ్డి ఇక లేరనే వార్తతో అనేక మంది ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేకపాటి నివాసానికి చేరుకొని గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకతీతంగా అందరితోనూ సౌమ్యంగా మాట్లాడే మృదుస్వభావి మేకపాటి గౌతమ్ రెడ్డి అని ఆయనతో గడిచిన సన్నిహిత సంబంధాలను గురించి నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా మేకపాటి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.