బెంగళూర్, ఫిబ్రవరి 21,
కన్నడ పవర్ స్టార్.. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పునీత్ భార్య అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణించిన కొన్ని నెలల్లోనే ఆయన మామగారు ఆకస్మాత్తుగా చనిపోవడంతో అప్పు కుటుంబం పూర్తిగా విషాదంలో మునిగిపోయింది. పునీత్ మరణించిన తర్వాత రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించగా… అప్పటికే ఆయన చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు.78 ఏళ్ల రేవనాథ్ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని.. పునీత్ అకాల మరణంతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. రేవనాథ్ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా.. అకా NHAIకి చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లా మూడిగెరె తాలూకాకు చెందినవారు రేవనాథ్.. పునీత్ రాజ్ కుమార్ మాదిరిగానే రేవనాథ్ మరణానతరం తన కళ్లను దానం చేశారు. పునీత్ మరణంతో శోక సంధ్రంలో మునిగిపోయిన కుటుంబసభ్యులకు ఇప్పుడు రేవనాథ్ మరణం మరోసారి విషాదాన్ని నింపింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పు మరణంతో కన్నడ చిత్రపరిశ్రమ దిగ్ర్బాంతికి గురయ్యింది. ఇక అప్పు చివరి సినిమా జేమ్స్… మార్చి 17న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.